ఆగమశాస్త్రం ప్రకారం పకడ్బందీగా జరగాలి: కేసీఆర్‌ | Telangana CM KCR Tour Of Yadadri | Sakshi
Sakshi News home page

ఆగమశాస్త్రం ప్రకారం పకడ్బందీగా జరగాలి: కేసీఆర్‌

Published Wed, Dec 18 2019 2:50 AM | Last Updated on Wed, Dec 18 2019 8:14 AM

Telangana CM KCR Tour Of Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఎలాంటి తొందరపాటు, ఆత్రుత అవసరం లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచిం చారు. ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్‌లైన్‌ పెట్టుకొని చేసేవి కావని, శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 17న యాదాద్రి సందర్శించి డిసెంబర్‌లో మళ్లీ వస్తానన్న సీఎం కేసీఆర్‌... చెప్పిన విధంగా సరిగ్గా నాలుగు నెలలకు యాదాద్రి పర్యటనకు వచ్చారు. మంగళవారం ఉదయం రోడ్డు మార్గాన యాదాద్రి చేరుకున్న కేసీఆర్‌ తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయనకు అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం సీఎం ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ సలహాలు, సూచనలు అందించారు. ‘‘గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏమాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యత పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి. ప్రతిదీ నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం. ఇక్కడ పూజలు చేయడం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశ, విదేశాల్లో స్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు దైవ దర్శనం, వసతి సౌకర్యాలు, పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’అని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

యాదాద్రి ఆలయంలో పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌ తదితరులు
గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. తొందరపాటొద్దు. జాగ్రత్త, నాణ్యత పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి. ప్రతిదీ నియమాలను అనుసరించి సాగాలి. – సీఎం కేసీఆర్‌

ఉద్యానవనాలు పెంచాలి...
ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఆలయ ప్రాంగణంలో దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, స్థల పురాణం ప్రస్ఫుటించే విధంగా తైలవర్ణ చిత్రాలను వేయించాలని ఆదేశించారు. అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వీవీఐపీ కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను పరిశీలించి కొన్ని మార్పులు సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని లాంటివారు వచ్చినప్పుడు వారికి సౌకర్యవంతంగా ఉండేలా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ఉండాలన్నారు. బస్వాపురం రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మారుస్తున్న విధంగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు సమీపంలో ఉన్న మైలార్‌గూడెం, యాదగిరిపల్లి చెరువులను కూడా సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయం ఉండే గుట్ట నుంచి రింగ్‌రోడ్డు మధ్యభాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

యాదాద్రిలో నిర్మించనున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నమూనా
స్వయంభూల దర్శనానికి ముహూర్తం పెట్టుకుందాం...
‘‘అమెరికాలో పర్యటిస్తున్న శ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి అక్కడి నుంచి రాగానే అందరం కూర్చొని స్వయంభూల దర్శనానికి ముహుర్తం పెట్టుకుందాం. లోకోత్తర స్థాయిలో మహాయాగం జరగాలని 3 వేల మంది యజ్ఞం చేసే వాళ్లు, 3 వేల మంది సహాయకులు, 3 వేల మంది ప్రచారకులను సిద్ధం చేస్తున్నాం. యాగానికి ప్రతిరోజూ 1.50 లక్షల నుంచి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తుంటారు కాబట్టి వారందరికీ వసతులు, భోజనాలు, ప్రసాదం ఏర్పాట్లు కల్పించాలి’’అని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ప్రాకారం బాగుందన్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా, ఆగమ శాస్త్రప్రకారం జరుగుతున్నాయని కితాబిచ్చారు. ప్రధానాలయంలో ప్రహ్లాద ఘట్టాలు ఎక్కడ వస్తున్నాయి? గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం ఎప్పుడు జరుగుతుంది? అని స్తపతులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ 100 కల్యాణాలకుపైగా జరిపే విధంగా మండప నిర్మాణం, ప్రధాన ఆలయం రెండవ ప్రాకారంలో అద్దాల మండపం పూర్తి కావాలన్నారు. ‘‘మరో 15 రోజుల్లో మళ్లీ వస్తా. చిన్న, పెద్ద పనులన్నీ పూర్తి కావాలి’’అని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వీవీఐపీ కాటేజీల నమూనా 
శిల్పులకు ప్రత్యేక అభినందనలు...
రాతి శిలలను అద్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని మెచ్చుకున్నారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అద్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలు సిద్ధమయ్యాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్దడం యాదాద్రిలోనే సాధ్యమైందన్నారు.

క్షుణ్ణంగా పనుల పరిశీలన...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి పర్యటన ఆరున్నరగంటలపాటు సాగింది. ఆలయంలో పూజల అనంతరం రెండు గంటలపాటు ప్రధానాలయ నిర్మాణ ప్రాంతంలో కేసీఆర్‌ కలియదిరిగారు. గోపురాలు, మాఢ వీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజ స్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం, వంటశాల, పుష్కరిణి, యాగశాల నిర్మాణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు.

మంగళవారం యాదాద్రి ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

యాదాద్రి ప్రధానాలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంతో కలసి మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, వివేకానంద, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వైటీడీఏ స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు, కలెక్టర్‌ అనితా రాంచంద్రన్, ఈఓ గీతారెడ్డి, ఆలయ నిర్మాణ శిల్పి ఆనంద్‌సాయి, స్తపతి ఆనందవేలు, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రవీందర్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆలయ పనులను పరిశీలించారు.

ఫ్రిబవరిలోగా పనులు పూర్తి కావా..?
‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్‌లైన్‌ పెట్టుకొని చేసేవి కావు’అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే నిర్మాణ పనులు ఫిబ్రవరిలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రధాన ఆలయ పనులతోపాటు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ల నిర్మాణం, ఆలయ పరిసర పనులు, రోడ్ల వెడల్పు, విస్తరణ పనులు, రింగ్‌రోడ్డు, గిరి ప్రదక్షిణ పనులు పురోగతిలో ఉన్నప్పటికీ క్యూలైన్లు, పార్కింగ్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆలయం పునఃప్రారంభం అయితే రోజూ లక్ష మంది వరకు భక్తులు వస్తారని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. కానీ వసతులు లేకుండా, నిర్మాణ పనులు పూర్తి కాకుండా భక్తులకు నృసింహుని స్వయంభూ దర్శనం కల్పిస్తే ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించే సీఎం పైవిధంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రధాన ఆలయ ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement