జైరాం వ్యాఖ్యలపై టీ కాంగ్ నేతల అసంతృప్తి
సీఎం రేసులో ఉన్న బీసీ, అగ్రవర్ణాల నేతల అసహనం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోనే చిచ్చు రేపాయి. సీఎం పదవిపై గంపెడాశలు పెట్టుకున్నముఖ్య నేతలంతా జైరాం వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ, అగ్రవర్ణాల నేతలు జైరాంపై అసహనంతో ఉన్నారు. అన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు కీలకమని, ఈ సమయంలో జైరాం ఓ వర్గానికే పెద్దపీట వేస్తామని చెప్పడం తొందరపాటు చర్యేనని అంటున్నారు. దీనివల్ల పార్టీ నేతల్లో చీలిక వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ఎస్.జై పాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలు సీఎం రేసులో ఉన్నారు. జైపాల్‌రెడ్డి మినహా మిగతా వారంతా తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్న వారే. సహజంగా పీసీసీ అధ్యక్షుడే ఎన్నికల తరువాత సీఎం రేసులో ముందుంటారు. ఈ తరుణంలో జైరాం దళిత సీఎం నినాదాన్ని ముందుకు తేవడంతో వారు ఖిన్నులయ్యారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం సీటు కోసం వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తాత్కాలికంగా వర్గ విభేదాలను పక్కనపెట్టి అంతా కలసికట్టుగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘తెలంగాణ సాధనలో మేమే ముందున్నాం. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. రాళ్ల దాడులకు గురయ్యాం. ఒక దశలో నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొన్నాం. అయినా వెనుకడుగు వేయకుండా నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలందరిలో మనోస్థైర్యం నింపేందుకు ప్రయత్నించాం.
నిత్యం సభలు, సమావేశాలు పెట్టాం. ఇన్ని కష్టాలు, నష్టాలు అనుభవించిన మమ్మల్ని కాదనడం, ఎన్నికల తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదు’’ అని దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీకి దూరమైన ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకే ‘దళితుడే సీఎం’ అనే నినాదాన్ని జైరాం ముందుకు తెచ్చారన్న వాదన కూడా ఉంది. అయితే ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లోని ఎస్సీ నేతల్లోనూ చీలికకు కారణమయ్యేలా ఉన్నాయని పీసీసీ ఎస్సీ విభాగం నేతలంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాబోయే సీఎం అని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తుండగా, సీఎం రేసులో తానూ ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రకటించారు. మాజీమంత్రి గీతారెడ్డి, మరికొందరు నేతలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పడు ఇలాంటి నేతల మధ్య పోటీ తీవ్రమై, మరిన్ని చిక్కులు వస్తాయని ఆ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్‌లో ‘దళిత సీఎం’ చిచ్చు
Published Tue, Mar 11 2014 2:06 AM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM
Advertisement