రాజేంద్రనగర్‌ రేసులో నిర్మాత బండ్ల గణేశ్‌? | Telangana Congress MLA Candidates List Released Today | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌ రేసులో నిర్మాత బండ్ల గణేశ్‌?

Published Sat, Nov 10 2018 12:18 PM | Last Updated on Sat, Nov 10 2018 2:10 PM

Telangana Congress MLA Candidates List Released Today - Sakshi

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  కాసేపట్లో ఉత్కంఠ వీడనుంది. కాంగ్రెస్‌ గెలుపుగుర్రాలేవో తేలనుంది. ఖరారు చేసిన అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ఆ పార్టీ విడుదల చేయనుంది. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్లను ప్రస్తుతానికి పక్కనపెడుతున్న ఏఐసీసీ.. ఆదివారం ప్రకటించే మలివిడత జాబితాలో అభ్యర్థులను ప్రకటించనుంది. ఒకరే పోటీపడుతున్న స్థానాలకు మొదటి జాబితాలో పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ జాబితా విడుదలతో పెండింగ్‌ స్థానాలపై కూడా స్పష్టత రానుంది. అదేసమయంలో పొత్తులో భాగంగా టీడీపీ, టీజేఎస్‌లకు కేటాయించే సెగ్మెంట్లేవనేది తేలనుంది. నేటి జాబితాలో మహేశ్వరం, కల్వకుర్తి, పరిగి, షాద్‌నగర్, ఎల్‌బీనగర్, కొడంగల్, వికారాబాద్, మేడ్చల్‌ నియోజకవర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సబితకు లైన్‌క్లియర్‌! 
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం)కి టికెట్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తనయుడి కోసం టికెట్‌ను త్యాగం చేసిన ఆమెకు ఈసారి తొలి లిస్టులోనే చోటు లభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొడంగల్, పరిగి, కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి అభ్యర్థిత్వాలకు కూడా ఆమోదముద్ర పడింది. ఎల్‌బీనగర్‌ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్, షాద్‌నగర్‌లకు కూన శ్రీశైలంగౌడ్, చౌలపల్లి ప్రతాప్‌రెడ్డిలను ఓకే చేసినట్లు సమాచారం.

వికారాబాద్‌పై సస్పెన్స్‌ వికారాబాద్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లైన్‌క్లియరైంది. ఇదే టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో స్క్రీనింగ్‌ కమిటీ చర్చించింది. మొదట ఆయనకు చేవెళ్ల ఇవ్వాలని భావించినా.. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఈ సీటును కేఎస్‌ రత్నంకు కేటాయించేందుకు కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొని రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కితగ్గిన ప్రసాద్‌కు టికెట్‌పై అప్పట్లోనే హామీ లభించిందనే ప్రచారం జరిగింది. అదేసమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడమేగాకుండా.. ఎమ్మెల్సీగా బరిలో దిగి ఆర్థికంగా నష్టపోయిన చంద్రశేఖర్‌కు కూడా న్యాయం చేయాలని, ఆయనకు ఎక్కడి నుంచైనా టికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సోనియాగాంధీ నేతృత్వంలోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. దీంతో వికారాబాద్‌ అభ్యర్థి ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

సామాజిక సమీకరణలతో.. 
తాండూరు స్థానం నుంచి పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం.. స్థానికంగా నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో మొదటి జాబితాలో ప్రకటించకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీటుపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించగా.. డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డితో అధిష్టానం మాట్లాడి బుజ్జగించింది. ఇక మేడ్చల్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ పేరుకు ఆమోదముద్ర పడ్డట్లు ప్రచారం జరుగుతున్నా నేటి జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా ఉంది.

ఇదే స్థానాన్ని ఆశిస్తున్న తోటకూర జంగయ్యయాదవ్‌.. సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికితోడు ఇరువురు నేతలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండడంతో ఈ సీటును టీజేఎస్‌కు ఇచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి ఇటీవల టీజేఎస్‌ తీర్థంపుచ్చుకున్నారు. దీంతో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వదిలివేయాలని కోదండరామ్‌.. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఇచ్చి ప్రతిపాదనల్లో పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది.

రెండో విడతలో పట్నం? 
ఇబ్రహీంపట్నం అభ్యర్థిపై ఖరారుకు ఇంకా ఉత్కంఠ వీడలేదు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సోదరుడు రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ ఈ స్థానం కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఈ త్రయం.. ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొనడంతో స్క్రీనింగ్‌ కమిటీ మల్లేశ్, మల్‌రెడ్డి బ్రదర్స్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డిని చర్చలకు ఆహ్వానించింది. ఈ సమావేశానికి మల్‌రెడ్డి సోదరులు గైర్హాజరుకాగా.. కోదండరెడ్డి, మల్లేశ్‌లు హాజరై తమ వాదన వినిపించినట్లు తెలిసింది.

రాజేంద్రనగర్‌ రేసులో బండ్ల గణేశ్‌ 
రాజేంద్రనగర్‌ సీటును టీడీపీకి వదిలేస్తారా? కాంగ్రెస్సే బరిలో దిగుతుందా? అనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతుండగా, ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ పేరు తెర మీదకు రావడం ఆసక్తికరంగా మారింది. సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండడం.. కమ్మ సామాజికవర్గానికి గ్రేటర్‌లో ఒక్క  సీటు కూడా కేటాయించకపోవడంతో గణేశ్‌కు టికెట్‌ ఇవ్వాలని మాజీ ఎంపీ లగడపాటి, మరికొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ టికెట్‌ తనకేనని ధీమాతో ఉన్న మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement