
సాక్షి, యాదాద్రి : జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో టికెట్ల టెన్షన్ నెలకొంది. ఎలాగైనా టికెట్ సాధించాలని ఆశావహులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. 60 మందితో తొలిజాబితా సిద్ధమైందని వస్తుందన్న వార్తల నేపథ్యంలో వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గాడ్‌ఫాదర్‌లకోసం గాంధీభవన్‌కు, అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతున్నారు.
ఎవరికి వస్తుందో?
జిల్లా కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. అధిష్టానం ఏం చేస్తుందో, టికెట్లు ఎవరెవరికి ఇస్తుందో అన్న ఆత్రుత నెలకొంది. ఒకవేళ టికెట్లు రానివారిని బుజ్జగించడంతోపాటు వారిని పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడే విధంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మేల్కోవాల్సిన అవసరం ఉందని ఆపార్టీ కార్యకర్తలు నాయకులకు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు.
అయితే అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తానని టికెట్ నాకే వస్తుందని ప్రకటించిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చౌటుప్పల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు.
ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
హస్తం గుర్తుపై పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు మొదలపెట్టారు. రాష్ట్రస్థాయి నేతలతో పాటు ఢిల్లీలో గల జాతీయ స్థాయి నేతలతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో సామాజిక వర్గాల సమీ కరణ, ఇతర పార్టీలైన టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో పొత్తులతో ఎదురయ్యే టికెట్ల ఇబ్బందులపై సమీక్షలు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే జిల్లాలో ఎలా సర్దుబాటు చేస్తారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నా రాయణరెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యదర్శి పచ్చి మట్ల శివరాజ్‌గౌడ్, బీబీనగర్ మాజీ సర్పంచ్ రామాంజనేయులు, తంగళ్లపల్లి రవికుమార్, అందెల లింగంయాదవ్‌లు ఇలా మరికొందరు భువనగిరి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు పల్లె శ్రీనివాస్‌గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశీస్సులతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.మునుగోడు నియోజకవర్గం ఇన్‌చార్జి పా ల్వాయి స్రవంతితోపాటు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, పున్నా కైలాస్‌నేతలు తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఈఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో రా జగోపాల్‌రెడ్డి తనకే టికెట్ వస్తుందని ప్రచారం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మరో నాయకుడు మామిడి నర్సయ్యలు టికెట్ల వేటలో ఉన్నారు. ఎవరికి వారే తమ నాయకుల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
వర్గ విభేదాలకు చరమగీతం పాడేనా?
గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వీరందరూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. వీరందరూ టికెట్ల కేటాయింపులో కీలకపాత్ర పో షించనున్నారు. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,కోమటిరెడ్డి సోదరులు రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే.
టికెట్ల కేటాయింపులో దీని ప్రభావం ఎంతోకొం త ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు ఆశావహులు టికెట్ల కోసం అధినేతల అనుగ్రహం కోసం ఉన్నారు. గత ఎన్నికల్లో వర్గ విభేదాలతో భువనగిరి పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధి లోని ఏడు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. గత ఎన్నికల గుణపాఠంతో ఈసారైనా గ్రూపు రాజకీయాలకు చరమగీతం పాడుతారా టికెట్ల పంపిణీలోనూ అదే పరిస్థితి ఉంటుందా.. అన్న ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment