‘కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయాల్లేవు’
నల్లగొండ: ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త జిల్లాలు, డివిజన్‌లు, మండలాల ఏర్పాటు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటును ప్రారంభించిందని రాజీవ్ శర్మ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న సూచనలు, సలహాలు, అభ్యంతరాలను బట్టి ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందన్నారు. నిర్ణీత సమయంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. కార్యాలయాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. శాఖల అవసరాలను అనుగుణంగా ఉద్యోగుల విభజన చేస్తునట్లు ఆయన తెలిపారు. శాశ్వత కలెక్టరేట్ ఇతర భవనాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించామని రాజీవ్ శర్మ చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.