
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై జరుగుతున్న సిట్ దర్యాప్తులో తొలి రోజే సంచలన విషయం బయటపడింది. తెలుగుదేశం పార్టీకి సేవామిత్ర యాప్ రూపొందించిన ‘ఐటీ గ్రిడ్స్’వద్ద ఏపీ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజల వ్యక్తిగత డేటా కూడా ఉందని ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్)కి నేతృత్వం వహిస్తున్న వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డేటా తస్కరణ ఎన్నికల ముందు జరిగిందా? సేవామిత్ర యాప్‌కు ఈ వివరాలు ఎవరిచ్చారు? అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణకు సంబంధించిన ఈ కేసు సున్నితమైన అంశమని, పైగా సైబర్ లింకులతో ముడిపడి ఉండటంతో ఇది చాలా సంక్లిష్టమైనదన్నారు. అందుకే కేసు దర్యాప్తులో సైబర్ రంగంలో నిష్ణాతులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు.
ఐటీ గ్రిడ్స్ ప్రజల వ్యక్తిగత డేటా తస్కరించిందన్న ఫిర్యాదులపై మాదాపూర్ (సైబరాబాద్), ఎస్సార్ నగర్ (హైదరాబాద్) పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి కాబట్టి సమగ్రమైన, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపేందుకే సిట్ ఏర్పాటైందన్నారు. సున్నిత అంశాలతో ముడిపడిన అంశం కాబట్టి మీడియా, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకునే వారెవరైనా సిట్‌ను ఆశ్రయించవచ్చని సూచించారు. కేసును శాస్త్రీయంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరుపుతామన్నారు. సేవామిత్ర యాప్‌లో ప్రజలకు సంబంధించిన ఓటరు ఐడీ, ఆధార్, కులం తదితర వివరాలను సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్‌కు ఎవరిచ్చారు? ఎప్పటి నుంచి ఈ డేటాను వారు యాక్సెస్ చేస్తున్నారు? బ్లూఫ్రాగ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు దీని వెనుక ఇతర అదృశ్య శక్తులెవరైనా ఉన్నారా? అనే వివరాలను త్వరలోనే తెలుసుకుంటామన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని, వారిని ప్రజల ముందుకు తీసుకొస్తామని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
ఆ ఫొటోల లీకేజీపైనా విచారణ..
తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు చోరీ చేశారంటూ ఏపీ ప్రభుత్వం, అక్కడి నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించబోమని స్టీఫెన్ పేర్కొన్నారు. ఈ అంశం తమ పరిధిలోది కాదన్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసుల విచారణను తప్పుబడుతూ అందుకు సంబంధించిన ఫొటోలను టీడీపీ అధినేత కుమారుడు, ఏపీ మంత్రి లోకేశ్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంపై స్టీఫెన్ స్పందించారు. తాము ఆ రోజు కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేశామని, ఒకవేళ తామేమైనా తీసుకెళ్లి ఉంటే ఆ ఫుటేజీలో ఉండేది కదా? అని ప్రశ్నించారు. అసలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వెళ్లిందనే విషయంపైనా తాము దృష్టి పెట్టామన్నారు. వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. లోకేశ్‌పైనా చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు చట్టం ముందు అంతా సమానమేనని స్టీఫెన్ స్పష్టం చేశారు.
అమరావతిలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా పట్టుకుంటాం...
ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ అశోక్ ఏపీ పోలీసుల రక్షణలో ఉన్నాడా అని విలేకరులు ప్రశ్నించగా ‘‘ఈ కేసులో మేం చట్ట ప్రకారమే వ్యవహరిస్తాం. నిందితుడు ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. ఆయన అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకురావడం తథ్యం’అని స్టీఫెన్ స్పష్టం చేశారు. అందుకు కోర్టు, ఈసీ సూచనలు, అనుమతులు తీసుకుంటామని, అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు.
డేటా చోరీ జరిగిందని ప్రాథమికంగా గుర్తించాం..
మార్చి 2న ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసులకు లభించిన సమాచారంలో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని గుర్తించామని స్టీఫెన్ వెల్లడించారు. ‘ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగాయి. పలు ఫీచర్లు, మాడ్యూల్స్‌లో కొన్ని మార్పులు జరిగినట్లు గుర్తించాం. అలాగే అశోక్ పారిపోయే ముందు కొంత సమాచారాన్ని పట్టుకెళ్లాడన్న సమాచారమూ తమ వద్ద ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment