
వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకొచ్చా..
హైదరాబాద్ : తనను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మంత్రి రాజయ్యను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాక రెండుసార్లు ఓడిపోయినా...వైఎస్ పిలిచి టికెట్ ఇస్తే 11వేల ఓట్లతో విజయం సాధించినట్లు వివరించారు. అయితే గెలిచిన కొంత కాలానికే వైఎస్ మరణించారని, ఆయన లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి వస్తే వైద్యశాఖ మంత్రి పదవి ఇస్తానని వైఎస్ చెప్పారని ఈ సందర్భంగా రాజయ్య గుర్తు చేసుకున్నారు. పశువుల కాపరి నుంచి చిన్న పిల్లల వైద్యుడిగా ఆపై ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన తనకు ఇప్పుడు పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.