డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం | Telangana DGP Mahender Reddy In List Of Top 25 IPS Officers In India | Sakshi
Sakshi News home page

డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం

Published Wed, Apr 8 2020 1:52 AM | Last Updated on Wed, Apr 8 2020 1:52 AM

Telangana DGP Mahender Reddy In List Of Top 25 IPS Officers In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు బాస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. దేశంలో తమ పనితీరుతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 25 మంది ఐపీఎస్‌ అధికారుల జాబితాలో ఆయనకు చోటుదక్కింది. ‘ఫేమ్‌ ఇండియా, ఆసియా పోస్ట్, పీఎస్‌యూ వాచ్‌’ మీడియా సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి ఈ జాబితా రూపొందించాయి. ఇందులో 1984 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌ , రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌ సమత్‌కుమార్‌ గోయల్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా సీఆర్‌పీఎఫ్‌ డీజీ మహేశ్వరి, ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ అనూప్‌కుమార్‌సింగ్, ఢిల్లీ సీపీ ఎస్‌ఎన్‌ సిన్హా, బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే, తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి (8వ స్థానం) ఉన్నారు.
 
25 అంశాల ఆధారంగా..
మెరుగైన పనితీరుతో సమాజంలో మార్పునకు కృషిచేసిన ఐపీఎస్‌ అధికారుల గుర్తింపునకు ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందుకోసం 1995కు ముందు బ్యాచ్‌ల్లోని 4వేల మంది ఆఫీసర్ల పనితీరును మదించి, వడపోశాయి. ఈ అధికారుల తొలి పోస్టింగ్‌ నుంచి ఇప్పటి వరకు వారి పనితీరు, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇంకా, ఆయా అధికారులపై వివిధ ఏజెన్సీలు రూపొందించిన అంతర్గత నివేదికలు, మీడియా కథనాలు, ఇతర సమాచారం ఆధారంగా 25 అంశాలకు ప్రాధాన్యమిస్తూ టాప్‌–200 జాబితాను తయారు చేశాయి. దీనిని మళ్లీ మదిస్తూ.. నేరాల కట్టడిలో ఈ అధికారుల పాత్ర, నిజాయతీ, నిష్పక్షపాతంగా విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, దార్శనికత, రెస్పాన్సిబిలిటీ వంటివి ఆధారంగా 25 మంది ఐపీఎస్‌ అధికారులతో తుది జాబితా రూపొందించాయి. ఈ జాబితాను పీఎస్‌యూ వాచ్‌ వెబ్‌సైట్‌ మంగళవారం ప్రచురించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1986 బ్యాచ్‌కు చెందిన డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి 8వ స్థానం దక్కింది. 

ఉత్తమ పోలీసింగ్‌తో అందరికీ ఆదర్శంగా..
డీజీపీ మహేందర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పోలీసింగ్, సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. షీటీమ్స్, విమెన్‌ సేఫ్టీవింగ్, వర్టికల్‌ విధానంలో మార్పులు, పాపిలాన్‌ తరహా సాఫ్ట్‌వేర్, పాస్‌పోర్టు ఎంక్వైరీలో వేగం, నక్సలిజం పీచమణచడం, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఠాణాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ల సాధన, టెక్నాలజీ వినియోగం వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన తీసుకున్న శ్రద్ధతో కేసుల దర్యాప్తులో, నిందితులకు శిక్షలు వేయించడంలో తెలంగాణ పోలీస్‌ విభాగం దేశంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. దేశంలో కీలకమైన నిఘా, సైనిక సంస్థలకు నాయకత్వం వహించే సీనియర్‌ అధికారుల సరసన డీజీపీ మహేందర్‌రెడ్డి నిలవడం ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితమేనని ఆయన కార్యాలయ సిబ్బంది అభివర్ణించారు. ఆయన సంస్కరణలకు పరిశ్రమ వంటివారని ప్రశంసించారు. 

ఇది తెలంగాణ పోలీస్‌కు దక్కిన గుర్తింపు
దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్‌ అధికారులపై జరిగిన సర్వేలో 25 మంది జాబితాలో నాకు చోటుదక్కడం సంతోషం. కానీ, ఇది నా ఒక్కడితోనే సాధ్యం కాలేదు. మొత్తం తెలంగాణ పోలీసు సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుంది. డిపార్ట్‌మెంటులోని హోంగార్డు నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు అందరి సంకల్పం, పట్టుదల ఈ గుర్తింపు రావడానికి దోహదపడ్డాయి. తెలంగాణ సమాజం కూడా పోలీసులకు ఎంతగానో సహకరిస్తోంది. అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది.
– ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement