
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించే కీలక ఘట్టం సోమవారం (నేటి) నుంచి శ్రీకారం చుట్టుకుంటోంది. జిల్లాలో అభ్యర్థుల నుంచి వీటిని స్వీకరించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
19వ తేదీన మ«ధ్యాహ్నంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 20వ తేదీన పరిశీలించి, సరైన పత్రాలు లేని వాటిని తిరస్కరిస్తారు. కాగా డిసెంబర్ 7వ తేదీన శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక పోటీలో నిల్చునే అభ్యర్థులు ముమూర్తాలు చూసుకుని మరీ..నామినేషన్ పత్రాలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 19వ తేదీన మంచి ముహూర్తం ఉందన్న కారణంతో ఆరోజు నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా అదేరోజు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మహాకూటమి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక వారు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మొదటిరోజు నామినేషన్లు పడేనా ?
టీఆర్‌ఎస్ మినహా మిగతా పార్టీలు పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లు మొద టి రోజు పడే అవకాశం కన్పించట్లేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల కూటమి పొత్తులు ఇంకా తేలకపోవడం, అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేవారు ఖరారు కాలేదు. దీంతో తొలిరోజు నామినేషన్లు పడే సూచనలు కన్పించట్లేదు. టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వీరంతా..మొద టి రోజే నామినేషన్ వేసేందుకు ఆసక్తి కనబర్చట్లేదు.
జిల్లాకు అబ్జర్వర్లు రాక..
జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను పర్యవేక్షించేందుకు వ్యయ పరిశీలకులు ఇద్దరు జిల్లాకు రానున్నారు. వీరిలో ఒకరు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను పర్యవేక్షించనుండగా, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను మరొకరు చూస్తారు. ఈ నెల 17వ తేదీన పోలీస్ అబ్జర్వర్ కూడా వస్తారు. జనరల్ అబ్జర్వర్లు ముగ్గురు ఈ నెల 19వ తేదీన చేరుకుంటారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గానికి ఒకరు, వైరా, మధిర నియోజకవర్గాలకు ఒకరు, సత్తుపల్లి నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఉంటారు.
డిపాజిట్ ఇలా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి ఫారం– 26 అఫిడవిట్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment