జిల్లా ఓటర్లు 8,90,229 | Telangana Elections Karimnagar Voters Increased | Sakshi
Sakshi News home page

జిల్లా ఓటర్లు 8,90,229

Published Sun, Oct 14 2018 8:29 AM | Last Updated on Sun, Oct 14 2018 8:29 AM

Telangana Elections Karimnagar Voters Increased - Sakshi

ఓటర్ల

జిల్లాలో తుది ఓటర్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు సవరణల అనంతరం జిల్లా వ్యాప్తంగా 8,90,229 ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. గత నెల 10న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 8,08,282 ఓటర్లుండగా ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణల అనంతరం జిల్లావ్యాప్తంగా 81,947 ఓటర్లు పెరిగారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగగా అత్యధికంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో 
    50,549 ఓటర్లు పెరగడం విశేషం. 

 

సాక్షి, కరీంనగర్‌సిటీ: జిల్లాలో కరీంనగర్‌తోపాటు పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తగ్గుతుందనే ఉద్దేశంతో జనవరిలో జిల్లా ఎన్నికల విభాగం అధికారులు సమగ్ర ఓటరు సర్వే (ఐఆర్‌ఈఆర్‌–2018) ప్రారంభించారు. బీఎల్‌వోలు, ట్యాబ్‌ ఆపరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ట్యాబ్‌లో ఓటర్ల ప్రస్తుత స్థితిగతులను పొందుపరిచారు. ఇంటి నెంబర్‌ ఇతర వివరాలతోపాటు సదరు ఇంటిని జియోట్యాగింగ్‌ చేశారు. ఒక ఇంట్లోని ఓటర్లంతా వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునేలా సవరణలు చేశారు. అయినప్పటికీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం భారీగా ఓటర్ల నమోదు శాతం తగ్గడం, తొలగింపులు జరిగాయన్న ఫిర్యాదులు, దరఖాస్తులు చేసినా నమోదు కాని వాటిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కరీంనగర్‌లోని 50 డివిజన్లకు ఒక్కో జిల్లా అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి ఆయా శాఖల సిబ్బందితో మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించింది.  విస్తృత ప్రచారం చేయడంలో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కృషి ఫలించింది.

కరీంనగర్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా 50,549 మంది ఓటర్లు పెరిగారు. అందులో 50 శాతం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,43,342 మంది పురుష, 4,46,832 మంది మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులున్నారు. సెప్టెంబర్‌ 10న విడుదల చేసిన ముసాయిదా జాబితా అనంతరం జరిగిన సవరణల అనంతరం కరీంనగర్‌లో 50,549 మంది ఓటర్లు పెరగగా చొప్పదండిలో 7,788, మానకొండూర్‌లో 10,147, హుజురాబాద్‌లో 13,463 మంది ఓటర్లు పెరిగారు. జిల్లావ్యాప్తంగా 1,01,682 దరఖాస్తులు రాగా విచారణ అనంతరం 19,735 అనర్హులని తొలగించారు.

ఇందులో మృతిచెందిన, వలసవెళ్లిన, ఆధార్‌ లేకపోవడం, రెండుచోట్ల ఓటు ఉన్నవారిని గుర్తించి తొలగించారు. ఈనెల 8 వరకు 1,01,682 ఓటరు నమోదు సవరణలకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 47,218 మంది పురుషులు, 54,443 మంది మహిళలు, 21 మంది ఇతరులు దరఖాస్తు చేశారు. విచారణ అనంతరం 19,735 దరఖాస్తులను తొలగించారు. అందులో 10,704 పురుషులవి కాగా 9,031 మహిళలవి ఉన్నాయి. కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి 5,144, చొప్పదండి నుంచి 6,500, మానకొండూర్‌ 2,944, హుజూరాబాద్‌ 5,147 దరఖాస్తులు తొలగించారు.

అభ్యంతరాలకు అవకాశం..
ఓటరు జాబితా సిద్ధమైంది. జాబితాను ఆయా పోలింగ్‌ కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీలు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. శనివారం అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో తుది ఓటర్ల జాబితా సాఫ్ట్, హార్డ్‌ కాపీలను అందజేశారు. అభ్యంతరాలుంటే సరిచూసుకోవాలన్నారు. జాబితాలో పేరుందా? లేదా? తప్పులున్నాయా? సరిచూసుకుని అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, మరోసారి నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నామినేషన్ల గడువు తేదీకి వారం రోజుల ముందు వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు అందించడానికి అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్‌ కవాతు
కొత్తపల్లి:   అసెంబ్లీ ఎన్నిక లు, దసరా పండగ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆదేశాలతో కొత్తపల్లి మండలం రేకుర్తిలో శనివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రతీ గ్రామంలో పోలీసులు కవాతు చేపడుతున్నారు. కరీంనగర్‌రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్, ఏఎస్సై గుణవత్‌సింగ్, ఏఆర్, సివిల్‌ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement