ఉద్యోగుల బదిలీలు | Telangana Employees Transfers Programme Starts Today | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బదిలీలు

Published Fri, May 25 2018 11:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Telangana Employees Transfers Programme Starts Today - Sakshi

నిజామాబాద్‌ నాగారం : ఎట్టకేలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు కానున్నాయి. జీ.ఓ ఎంఎస్‌ నం. 61 ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ జూన్‌ 15 వరకు కొనసాగుతుంది. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు రెండు, మూడు రోజుల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గైడ్‌లైన్స్‌ వెల్లడించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ, కౌన్సెలింగ్, బదిలీలు ఎట్టిపరిస్థితుల్లో గడువులోపు పూర్తి చేయాలి. నేటి నుంచి బదిలీలకు సంబంధించిన ప్రక్రియలో ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు నిమగ్నం కానున్నారు. ఒకే దగ్గర రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులందరికీ బదిలీలు ఉంటాయి.

ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పనిచేస్తున్న వారు కచ్చితంగా బదిలీ కావాల్సిందే. స్పౌజ్‌ (భార్యాభర్తలు ఉద్యోగలు), మెడికల్‌ గ్రౌండ్, వితంతువు కేసులను మినహాయించనున్నారు. ఈ కేటగిరికి చెందిన వారు బదిలీ కోరుకుంటే చేస్తారు. ఏడాదిలోపు రిటైర్‌మెంట్‌ ఉన్న వారికి బదిలీ లేదు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. జిల్లాల విభజన నేపథ్యంలో ఇతర జిల్లాలకు ఆర్డర్‌ టు సర్వ్‌ ద్వారా వెళ్లిన ఉద్యోగులకు బదిలీలకు ఉంటాయి. వారు తమ సొంత జిల్లాలకు రావాలని ఆశ పడుతున్నారు. పనిచేసే చోట రెండేళ్లు పూర్తి కాకున్నా ప్రభుత్వం వీరి బదిలీలకు అవకాశం ఇచ్చింది.

జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 40 శాతం ఉద్యోగులకు బదిలీలు కానున్నాయి. సుమారుగా 15 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. దాదాపు అన్ని శాఖ ల్లో రెండేళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరి రెండేళ్లు నిండని వారు పదుల సంఖ్యలో ఉంటారు. పదోన్నతులపై వెళ్లిన వారికి రెండేళ్లు నిండకుంటే బదిలీలు ఉండవు. ఏడేళ్ల తర్వాత ఉద్యోగుల బదిలీలు కానున్నాయి. 
 
నేటినుంచి..
శుక్రవారం నుంచి 31 వరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. జూన్‌ 1 నుంచి 5 వర కు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 6 నుంచి 12 వరకు దరఖాస్తులను పరిశీలించి, బదిలీలు చేపడతారు. 13 నుంచి 15 వరకు బదిలీ ఆర్డర్లను జారీచేస్తారు. దీంతో బదిలీల ప్రక్రియ ముగుస్తుంది. తిరిగి జూన్‌ 16 నుంచి బదిలీలపై నిషేధం విధిస్తారు. కాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మరో జీవో విడుదల చేయనున్నారు. 
 
అందరికీ న్యాయం : టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ 
బదిలీలలో ఉద్యోగులందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తాం. ఉద్యోగులు బదిలీలను కోరుకుంటున్నారు. అన్ని శాఖల్లోని ఉద్యోగులందరికీ సమన్యాయం జరిగే విధంగా టీఎన్జీవోస్‌ అండగా ఉంటుంది. ఆర్డర్‌ టు సర్వ్‌ వారికి కూడా  బదిలీ లు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement