అన్యాక్రాంతమైన అటవీ భూములపై ఆ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అటవీ భూముల పునరుద్ధరణతోపాటు వన్యప్రాణులకు ఆవాసంగా మలిచేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ఒకే చోట 15 అడవి దున్నలు చిక్కాయి. కిన్నెరసాని పరిధిలోని చాటకొండ అటవీ రేంజ్ చింతోనిచిలక వద్ద అడవి దున్నల మంద సేద తీరుతున్న దృశ్యాలు కెమెరాకు దొరికాయి. ఆక్రమణలకు గురైన 716 హెక్టార్ల అటవీ భూమిని ఐదేళ్ల కిందట అటవీ శాఖ తిరిగి తమ అధీనంలోకి పునరుద్ధరణకు పూనుకుంది. అంతేకాకుండా కంపాతోపాటు బయోశాట్ నిధులతో పునరుజ్జీవన చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతం మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో చుట్టూ కందకాలు తవ్వారు. చైన్ లింక్ ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేసి మనుషులతోపాటు, పశు సంపద, పెంపుడు జంతువుల కదలికలు కూడా అటవీ ప్రాంతంలో లేకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడే బేస్ క్యాంపును ఏర్పాటు చేయటంతోపాటు నీటి వసతిని పరిరక్షించే చర్యలు చేపట్టారు. సోలార్ బోర్లను ఏర్పాటు చేసి శాకాహార జంతువుల కోసం సహజమైన గడ్డిమైదానాలు పెరిగేలా చూశారు.
– సాక్షి, హైదరాబాద్
బెదిరింపులు వచ్చాయి...
నిరంతర నిఘాతో పాటు, తరచుగా ఉన్నతాధికారులు అటవీ ప్రాంతంలో పర్యటించటం మంచి ఫలితాలను ఇచ్చిందని ఖమ్మం రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ రాజారావు తెలిపారు. సహజ అడవి, ఆవాస చర్యలు చేపట్టిన తర్వాత కూడా అనేక సార్లు ఆక్రమణదారులు దాడులు చేశారని, బేస్ క్యాంపు సిబ్బందిని బెదిరించటంతో పాటు, బోర్ వెల్స్‌ను ధ్వంసం చేసినట్టు చెప్పారు. అయినా పటిష్ట వ్యూహంతో అటవీ భూమిని కాపాడుతున్నట్టు కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి రాంబాబు తెలిపారు. తాము ఐదేళ్లు పడిన శ్రమకు తాజాగా కనిపించిన భారీ అడవి దున్నల గుంపుతో తగిన గుర్తింపు వచ్చిందన్నారు. చుక్కల దుప్పి, జింకలు, అడవి పందులు, నీల్గాయి లాంటి ఇతర జంతువులు కూడా గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. చిరుత పులుల సంచారంపై సమాచారం ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. కిన్నెరసాని అటవీ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తామని, పర్యాటకుల కోసం ఎకో టూరిజం ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.
కామారెడ్డి అడవుల్లో
మరోవైపు కామారెడ్డి అటవీ ప్రాంతంలోనూ ఒకే చోట మూడు చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. వేసవిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన నీటి వసతి దగ్గర ఇవి సేదతీరినట్టు వెల్లడి కావడంతో కొత్తగూడెం రేంజ్ అధికారులు, సిబ్బందిని అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఎండాకాలంలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఓవైపు అడవి అగ్నిప్రమాదాల బారిన పడకుండా చూడటం, మరోవైపు వన్యప్రాణులకు నీటి వసతిని ఏర్పాటు చేయటం, వేటగాళ్ల నియంత్రణ పకడ్బందీగా చేపట్టాలని పీసీసీఎఫ్ పీకేఝా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment