కేసీఆర్ అబద్ధాలకోరు: పొన్నం
కాటారం(కరీంనగర్ జిల్లా): అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరని మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్ విమర్శించారు. గురువారం కరీంనగర్ జిల్లా కాటారంలో వివాహానికి హాజరైన వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని హామీలను కురిపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ స్వలాభం కోసమే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు రూపకల్పన చేశారన్నారు.
ఖరీఫ్ సమయం దగ్గర పడుతోందని, చెరువుల పనులు ఎప్పుడు పూర్తి పంటలకు నీళ్లందిస్తారని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ వరకు ఎన్ని చెరువులు పూర్తి చేసి, ఎన్ని ఎకరాలకు నీరందిస్తారన్న లెక్కలను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం పూటకో ధోరణి అవలంబిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ గొప్పతనాన్ని పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం శోచనీయమన్నారు. ఈ ఏడాది నుండి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయడంతోపాటు దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయూలన్నారు.