తెలంగాణకు ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్!
- తైవాన్ పర్యటనలో ‘ఫాక్స్‌కాన్’ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
- హైదరాబాద్‌లో యూనిట్లు నెలకొల్పాలని విజ్ఞప్తి
- త్వరలో తమ ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు సంస్థ సీఈవో అంగీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, పారిశ్రామిక విధానాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్‌కు చెందిన యఫ్‌హెచ్ మొబైల్స్ కంపెనీ సీఈవో డబ్ల్యుయచ్ తాంగ్ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ యూనిట్లను నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
తమ ప్రతినిధుల బృందాన్ని త్వరలోనే హైదరాబాద్ పంపనున్నట్లు మంత్రికి హామీ ఇచ్చారు. అనంతరం టెక్ గ్రూప్ చైర్మన్ ధియోడర్ హువాంగ్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే.. ైతె వాన్ ఆర్థిక వ్యవహారాల ఉపమంత్రి షి.చావోతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తైవాన్ నుంచి పెట్టుబడిదారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. శనివారంతో తైవాన్ పర్యటనను ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.