తెలంగాణకు జాతీయ అవార్డు  | Telangana Got National Award For Pure Silk Production | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 5 2019 2:24 AM | Last Updated on Tue, Feb 5 2019 2:24 AM

Telangana Got National Award For Pure Silk Production - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ ఏడాది దేశంలో అత్యధికంగా బైవోల్టిన్‌ (అత్యంత నాణ్యమైన) పట్టు గుడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా గుర్తించిన కేంద్ర జౌళిశాఖ తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పట్టుపరిశ్రమ శాఖకు కేంద్ర జౌళిశాఖ సోమవారం లేఖ రాసింది. ఈనెల 9న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ, పట్టు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి అందుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,176 ఎకరాలుగా ఉన్న మల్బరీసాగు గత నాలుగేళ్లలో 10,645 ఎకరాలకు విస్తరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్లలో సాధించలేని ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించడం పట్ల పట్టుపరిశ్రమ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ ఘనత... 
నాలుగేళ్ల కాలంలో అధిక దిగుబడినిచ్చే ‘బైవోల్టిన్‌’పట్టుగూళ్లను తెలంగాణ 100 శాతం ఉత్పత్తి చేసింది. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టుని పూర్తిస్థాయిలో స్థానికంగా వినియోగించుకునే స్థాయికి రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ ఎదిగింది. గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, కొత్తపేటలో పనిచేస్తున్న పట్టు మగ్గం నేత పనివాళ్లకు ఈ నాణ్యమైన పట్టు అందచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉత్పత్తిదారులకు కిలోకి రూ.75 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement