వడదెబ్బ, పిడుగుపాటు మరణాలకూ పరిహారం ఇవ్వాలి | Telangana Government appeals to Consider SDRF | Sakshi
Sakshi News home page

వడదెబ్బ, పిడుగుపాటు మరణాలకూ పరిహారం ఇవ్వాలి

Published Sat, Sep 20 2014 1:51 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Telangana Government appeals to Consider SDRF

సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ, పిడుగుపాట్లతో సంభవిస్తున్న మరణాలను ప్రకృతి వైపరీత్యాలుగానే పరిగణించి ప్రకృతి విపత్తుల సహాయ నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద ఆదుకోవాలని 14వ ఆర్థికసంఘాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్న ఈ తరహా మరణాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ వర్తించని కారణంగా బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందడం లేదని తెలిపింది. 
 
శుక్రవారం 14వ ఆర్థికసంఘంతో జరిగిన సమావేశంలో ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, దీని నివారణకు కేంద్రం పెంచాల్సిన సాయం తదితరాలపై ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో వరుస కరువు, అకాలవర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాడ్పడ్డారని పేర్కొంది. పంటనష్టం 50 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుందన్న కేంద్రనిబంధన రైతాంగానికి ప్రతికూలంగా మారిందని రాష్ట్రప్రభుత్వం వివరించింది. 
 
అందువల్ల ఇన్‌పుట్ సబ్సిడీకి పంట నష్టం అర్హతని 50శాతం నుంచి 25శాతానికి తగ్గించాలంది. దెబ్బతిన్న పంట విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్సిడీని నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. 2007 నుంచి 2013 వరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద మొత్తంగా రూ.4,676.61కోట్లు కేటాయించినప్పటికీ.. ఒకే ఏడాదిలో విపత్తులు ఎక్కువగా వచ్చినందున రూ.2,160కోట్లు ఎక్కువగా అంటే రూ.6.836.97కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది. రాష్ట్రం అదనంగా ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం 75:25 నిష్పత్తిలో భరించాలని కోరింది. 
 
 1997 నుంచి ఆత్మహత్యలు 3,317..
 రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ప్రతిఏటా సగటు వర్షపాతంతో పోలిస్తే 18 నుంచి 24శాతం తక్కువ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తేల్చిందని,తక్కువ వర్షపాతం కారణంగా కరవు రాష్ట్రాల్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని తెలిపింది. 1997 నుంచి 2013 వరకు రాష్ట్రం వరుసగా పది ఏడాదుల్లో కరవును ఎదుర్కొనగా, 2009 నుంచి వరుసగా కరువు ఏర్పడింది. దీంతో 1997 నుంచి 2011 వరకు 3,317మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement