ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి సారథ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల సమయంలో ఎలాంటి వివక్ష జరగకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. తెలంగాణ స్థానికత ఉండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయింపు వ్యవహారాన్ని అతిజాగ్రత్తగా గమనించడానికి ఈ కమిటీని నియమించారు.
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్‌పీటర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌బీఎల్ మిశ్రా, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సౌమ్యా మిశ్రా, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, సర్వీసెస్ కార్యదర్శి వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ(రాష్ట్ర విభజన) డిప్యూటీ సెక్రటరీ దీనికి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ వారంలో ఒకసారి సమావేశమై ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించాలని, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపు చేసే సమయంలో రాష్ట్ర సలహా కమిటీకి నివేదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ఈ కమిటీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఉద్యోగుల స్థానికతకు సంబంధించి వారి నుంచి సమాచారం తీసుకోవాలని, వాటి ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు అధికారిక కమిటీ కి సిఫారసులు చేయాలని సూచించారు. తాత్కాలిక పద్ధతిలో ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఉద్యోగుల కేటాయింపు జాబితాను పరిశీలించాలని.. సమావేశాలు నిర్వహించే సమయంలో తెలంగాణ సచివాలయ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుల సహకారం తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ కమిటీ ఏడాదిపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సచివాలయ ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్లను తనిఖీ చేయడానికి మరో కమిటీని నియమించనున్నట్టు తెలిసింది. సచివాలయంలో తెలంగాణ స్థానికత చూపించి కొనసాగుతున్న ఉద్యోగులపై వచ్చే అభ్యంతరాల పరిశీలన కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ
Published Fri, Aug 8 2014 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement