విద్యుత్ బకాయిల విషయంలో గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కారు ‘షాక్’ ఇచ్చింది. పెండింగ్ పడిన వీధి దీపాలు, నీటి సరఫరా పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను పంచాయతీలే చెల్లించుకోవాలని స్పష్టం చేయడంతో సర్పంచులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు బకాయిల చెల్లింపు కోసం ట్రాన్స్‌కో ఒత్తిడి చేస్తోంది.
ఇందూరు : భారమైనప్పటికీ విద్యుత్ బకాయిలను ఎంతో కొంత మేరకు కట్టుకుంటూపోవాల్సిన బాధ్యత పంచాయతీలదేనని, నిధులు సరిపోని తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు (485సీపీఆర్ అండ్ ఆర్‌ఈ/జీ1 2014) జారీ అయ్యాయి.
దీంతో జిల్లాలో పేరుకుపోయిన రూ.117కోట్లకు పైగా బకాయి లను ప్రస్తుతం పంచాయతీలే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదా యం అంతంత మాత్రమే. సపాయి కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా ఆ నిధులు సరిపోవు. ఇలాంటి తరుణంలో స్వయంగా పంచాయతీలే విద్యుత్ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని అం టున్నారు.
ప్రత్యామ్నాయంగా 13వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్స్ నిధుల నుంచి చెల్లించుకోవచ్చని కాస్త ఊరట కలిగించే ఆదేశాలను ప్రభుత్వం ఇచ్చింది. కానీ పెద్ద మొత్తంలో ఉన్న విద్యుత్ బకాయిలను పంచాయతీలవారీగా చూస్తే లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల నిధుల్లోంచి ఒకటి రెండు నెలలకు సంబంధించిన బకాయిలను మాత్రమే చెల్లించే అవకాశం ఉన్నం దున పాత, కొత్త బిల్లులను కట్టడానికి వీలుపడదు. ఫలితంగా ఆదాయం లేని పంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించడం తీరని భారంగానే మారబోతుంది.
జిల్లాలో పేరుకుపోయిన రూ.117 కోట్ల బకాయి విద్యుత్ బిల్లులను చెల్లించడం తమ వల్ల కాదని గ్రామాల సర్పం చులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖ అధికారులకు నెల రోజుల క్రితంం స్పష్టం చేశా రు. జిల్లా, రాష్ట్ర సర్పంచు ఫోరం నేతలు పంచాయతీరాజ్ కమిషనర్‌ను, ఇతర ఉన్న తాధికారులను కలిసి బకాయిల భారాన్ని వివరించారు. విద్యుత్ బిల్లులను ప్రభుత్వం భరించకపోతే అందోళనకు పూనుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. హామీ ఇచ్చిన మంత్రులు కూడా చేతులెత్తేయడంతో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గత ప్రభుత్వాలు జీఓ నం.80 ప్రకారం పంచాయతీలకు సంబంధించి విద్యుత్ బిల్లులను భరించాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో సర్పంచులకు నిరాశను మిగిల్చింది. జి ల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఎక్కువగా సర్పంచులుగా గెలిచారు. మరి కొందరు గెలిచిన తరువాత పార్టీలోకి చేరారు. బకాయిల చెల్లింపు విషయంలో సొంత ప్రభుత్వం పై ఆందోళన చేయడానికి సర్పంచు ఫోరం నేతలు వెనకడుగు వేస్తున్నారు. కనీసం నిరసన తెలుపడానికి కూడా వీలు లేకుండా పోయిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా మలిదశగా బకాయిలను వసూలు చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ బకాయిలలో ఎంతో కొంత కడితేనే కరెంటు సరఫరా ఉంచాలని లేకపోతే కనెక్షన్ కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మేజర్ పంచాయతీలకు కరెంటోళ్ల బాధలు ఉండకపోయినా మైనర్ పంచాయతీలకు తిప్పలు తప్పేలా లేవు.
మైనర్ పంచాయతీలకు ఆదాయం అంతంత మాత్రమంగానే ఉండగా, 13వ ఆర్థిక సం ఘం, జనరల్ ఫండ్ నిధులు కూడా చాలీ చాలని విధంగా రావడంతో బకాయిలు చెల్లించడం ఇబ్బం దికరంగానే మారబోతుంది. ముఖ్యంగా నీటి పథకాలకు ఆటంకం కలుగడంతో పాటు గ్రామాలే అంధకారంలో ముగినిపోయే ప్రమాదముంది. మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విన్నవించి కనెక్షన్‌లు తొలగించకుండా ప్రయత్నాలు చేయాల్సిందేనని సర్పంచులు వాపోతున్నారు.
పంచాయతీలకు ‘షాక్’
Published Fri, Dec 19 2014 2:03 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement