సమితులకు రాజముద్ర | Telangana Government is an initiative to legitimize farmers' coordination sets | Sakshi
Sakshi News home page

సమితులకు రాజముద్ర

Published Sat, Sep 9 2017 2:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

సమితులకు రాజముద్ర - Sakshi

సమితులకు రాజముద్ర

► రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించే యోచనలో సర్కారు
►కార్పొరేషన్‌ లేదా సొసైటీలుగా నెలకొల్పే యోచన
►వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి అధికారాల అప్పగింత.. వ్యవసాయ శాఖకు సమాంతర వ్యవస్థ
►కాంగ్రెస్‌ కోర్టు గడప తొక్కడంతో తర్జనభర్జన
►న్యాయ సలహా అనంతరం తుది నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించే యోచనలో ఉంది. అయితే కేవలం ఒక జీవో ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సమితుల ఏర్పాటు, వాటి సభ్యులు, సమన్వయకర్తల నియామకంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న ఆందోళన సర్కారును వెన్నాడుతోంది. పైగా మంత్రులే వీటిని నామినేట్‌ చేస్తుండటం, అనేకచోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకే చోటు ఉండటంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లింది. దీంతో ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.

రైతు సమన్వయ సమితుల బాధ్యతలు, అధికారాలు, హక్కులపై ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదు. రైతులకు అన్ని విధాలా సహకరించాలని మాత్రమే సమితి సభ్యులకు చెబుతున్నారు. అదీగాకుండా వ్యవసాయశాఖ విస్తరణ వ్యవస్థ ఉండగా ఎలాంటి చట్టబద్ధత లేని రైతు సమన్వయ సమితులు సహకరించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితికి రూ.500 కోట్ల మూలధనం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం జీవోపై ఆధారపడి అమలు చేసే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించి అధికారాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. న్యాయ సలహా మేరకు చట్టబద్ధతపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నాయి.

కార్పొరేషన్‌ లేదా సొసైటీ!
విత్తనం వేయడానికి ముందు నుంచి చేతికొచ్చిన పంట అమ్ముకునే వరకు రైతులకు అవసరమైన సహకారం అందించడం రైతు సమన్వయ సమితుల ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి ఎకరానికి రూ.4 వేలు అందించే రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం వీటి ప్రధాన బాధ్యత. అందుకోసం నిజమైన రైతులను గుర్తించడం వీటి లక్ష్యం. రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితి చేతిలో రూ.500 కోట్ల మూలధనం ఉంచనున్నారు. అది రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే రైతుకు మూలధనం నుంచి సాయం చేసేలా సహకరిస్తుంది.

చట్టబద్ధత లేకపోతే ఇవన్నీ సాధారణ సమితులతో చేయడం సాధ్యం కాదంటున్నారు. న్యాయపరంగా చిక్కులు కూడా వచ్చేది ఇక్కడే. అందువల్ల గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులన్నింటినీ రిజిస్ట్రేషన్‌ చేయించి కార్పొరేషన్‌ లేదా సొసైటీ ఏర్పాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయశాఖ పేర్కొంటున్నాయి. కార్పొరేషన్‌ లేదా సొసైటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్, డైరెక్టర్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. ఆ ప్రకారం రైతు సమన్వయ సమితి అనే పేరు కూడా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాటికి ఎన్నికలు నిర్వహించకుండా ప్రస్తుత నామినేట్‌ పద్ధతిలోనే ఉండేలా చట్టంలో ఉన్న వెసులుబాటును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

చైర్మన్‌గా ఎంపీ..
రాష్ట్ర స్థాయిలోని రైతు సమన్వయ సమితికి చైర్మన్‌గా ఓ ఎంపీ పేరు బలంగా వినిపిస్తోంది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు కూడా చైర్మన్లను నియమించి వారందరికీ గౌరవ వేతనాలిచ్చే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్‌ లేదా సొసైటీల్లో సభ్యులుగా ఉండే రైతులు షేర్‌ కేపిటల్‌ కింద కొద్దిమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ రకంగా మూలధనాన్ని పెద్దఎత్తున సేకరించవచ్చన్న తెలుస్తోంది.

వ్యవసాయ శాఖ నీరుగారిపోతుందా?
వ్యవసాయశాఖకు సమాంతర వ్యవస్థగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయన్న చర్చ జరుగుతోంది. ఇవి ప్రస్తుత వ్యవసాయశాఖ విస్తరణ వ్యవస్థపై అధికారం చెలాయించే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో), మండలానికి వ్యవసాయాధికారి (ఏవో), నియోజకవర్గానికి ఏడీఏ ఉన్నారు. వాటికి సమాంతరంగా సమితులు ఏర్పడబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. పైగా విత్తనం వేయడం నుంచి పంట విక్రయం వరకు ఇవి కీలకమైతే ఇక వ్యవసాయశాఖ వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement