పక్కాగా... పకడ్బందీగా.. | Telangana Government Ready To Counter Cases Over Municipal Elections | Sakshi
Sakshi News home page

పక్కాగా... పకడ్బందీగా..

Published Mon, Jul 22 2019 7:16 AM | Last Updated on Mon, Jul 22 2019 7:16 AM

Telangana Government Ready To Counter Cases Over Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అడ్డంగా మారిన కోర్టు కేసుల నుంచి బయటపడేందుకుగాను హైకోర్టులో పకడ్బందీగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలలోపు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం, నేడు హైకోర్టులో జరగనున్న కేసు విచారణలో కోర్టు సంతృప్తి చెందేలా వాదనలు వినిపించడంతో పాటు శాస్త్రీయంగా కౌంటర్‌ దాఖలు చేసేందుకు కసరత్తు చేసింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మున్సిపల్, న్యాయశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. భేటీలో భాగంగా మున్సిపల్‌ ఎన్నికలపై కోర్టుల్లో ఉన్న కేసులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాల వివరాల గురించి సీఎస్‌ జోషి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో హైకోర్టుకు ప్రభుత్వమే దాఖలు చేసిన కౌంటర్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు 150 రోజుల గడువు అవసరం అవుతుందని చెప్పిందని, ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తోందంటూ దాఖలైన పిల్‌పై నేడు మళ్లీ జరిగే విచారణలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 15 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు స్టే ఇవ్వడంతోపాటు మరో 45 మున్సిపాలిటీలపై కేసులు పడటంతో మళ్లీ కోర్టుల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా హైకోర్టుకు పకడ్బందీ కౌంటర్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

‘మున్సిపల్‌’పై గెజిట్‌ ఉత్తర్వులు 
ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన మున్సిపల్‌ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19న శాసనసభ ఆమోదించిన బిల్లును ఆదివారం గవర్నర్‌ ఆమోదించడంతో తెలంగాణ మున్సిపల్‌ నిబంధనలు (సవరణ) చట్టం–2019గా దీన్ని గెజిట్‌ చేస్తున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.   

మళ్లీ వాయిదాపడితే?
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఈ విచారణ మళ్లీ వాయిదా పడితే ప్రభుత్వం ఆశించిన విధంగా ఈ నెలాఖరులోపు ఎన్నికల నిర్వహణ వాయిదా పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్‌కు మార్గం సుగమం చేసినప్పటికీ, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కనీసం 16 రోజులు పట్ట నుంది. అంటే ఆగస్టు మూడో వారా నికి ఎన్నికల నిర్వహణ వెళ్లిపోతుంది. అదే కోర్టు ఏమీ తేల్చకుండా మళ్లీ వాయిదా వేస్తే ఆ మేరకు ఆగస్టు చివరి వారానికి, లేదంటే ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో సోమవారం జరిగే విచారణలోనే ఈ కేసును ముగించేలా పకడ్బందీ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ పక్షం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement