ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండలంలోని కాసనగోడు ఉన్నత పాఠశాలలో రూ.37.69 లక్షల ఆర్‌ఎంఎస్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంలో గత పాలకుల వైఫల్యం వల్లే నేడు తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.
అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలుకు కార్యాచరణ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎంఈఓ డి.వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్త మంజుల, జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, స్థానిక సర్పంచ్ బొజ్జ సైదమ్మ రామకృష్ణ, ఎంపీటీసీ కందుల మోహన్‌కుమార్, ఉప సర్పంచ్ దయాకర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కరుణ, పీఆర్‌టీయూ మండల కార్యదర్శి కె.వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ పి.జగన్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.