25 శాతం నిధులు మిగిలినట్లే!
‘సర్వే’ సమాచారం ఆధారంగా పలు పథకాల్లో కోత పెట్టనున్న సర్కారు
ఆదా అయిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లింపు
టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసుల అనంతరమే బడ్జెట్‌కు తుది రూపు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని తగ్గించడం వల్ల.. వాటికి అవుతున్న వ్యయంలో దాదాపు 25 శాతం నిధులు ఆదా చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సమగ్ర ఇంటింటి సర్వే సమాచారాన్ని వినియోగించుకోనుంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యార్థులకు ఆర్థిక సాయం, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణ పథకాల్లో నిధుల దుర్వినియోగాన్ని చాలా వరకూ అరికట్టవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనివల్ల ఆదా అయిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల రేషన్ కార్డులను సరెండర్ చేయగా... ఆధార్ సీడింగ్‌తో మరో ఐదు లక్షల రేషన్‌కార్డులను తొలగిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా కోటికిపైగా ఉన్న రేషన్‌కార్డుల్లో ఇప్పటికే పది లక్షల వరకూ తగ్గడంతో... పౌర సరఫరాల శాఖ వ్యయంలో పది శాతం వరకూ నిధులు ఆదా అయినట్లేనని పేర్కొన్నాయి.
ఇక పింఛన్లలోనూ ఇదే పద్దతి అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పింఛన్లను ఏకంగా రూ. వెయ్యి, పదిహేను వందలకు పెంచుతుండడంతో... బోగస్ లబ్ధిదారుల తొలగింపు చేపడతారని చెబుతున్నారు. అలాగే అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించేదిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన బడ్జెట్‌లకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అధికారవర్గాలు వివ రించాయి. కానీ బడ్జెట్ కోసం వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత అధికారులకు దిమ్మతిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ప్రణాళిక వ్యయం కింద రూ. 60 వేల కోట్ల ప్రతిపాదనలు వస్తే.. తెలంగాణ రాష్ట్ర అధికారులు గత బడ్జెట్ అంచనాలను యథావిధిగా రూపొందించి.. ఏకంగా రూ. 68 వేల కోట్ల మేరకు ప్రణాళిక ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఎలాంటి కసరత్తు లేకుండా అధికారులు ప్రతిపాదనలు పంపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో... లక్ష్యాన్ని సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఇచ్చే నివేదికల తరువాత బడ్జెట్‌పై తుది నిర్ణయానికి వస్తారని ఓ అధికారి వివరించారు.
సమగ్ర సర్వేపై వర్క్‌షాప్..
సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై సలహాలు, సూచనల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం అపార్డ్‌లో వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్‌ఐఆర్‌డీ, పంచాయతీరాజ్, సెర్ప్ అధికారులు, ఆర్థిక, సామాజికవేత్తలతో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అధికారులు, నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.