సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)పై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పరిచయం చేసేందుకు.. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇక్కడ ఉన్న అవకాశాలను చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తోంది. అమెరికా ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తుండటం, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనుంది. తద్వారా భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. సదస్సుకు కనీవినీ ఎరుగని తరహాలో అపూర్వ ఏర్పాట్లు చేస్తోంది.
నూతన పారిశ్రామిక విధానంతో..
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సింగపూర్, వియత్నాం దేశాల్లో ఉన్న పారిశ్రామిక విధానాలకంటే మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అనుమతులను సులభతరం చేయటంతో పాటు అవాంతరాలు, అడ్డంకులేమీ లేని పాలసీని ఆవిష్కరించింది. పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే, ఒకేచోట అందించే ఏర్పాట్లు చేసింది. 2015 జూన్‌లో అమల్లోకి వచ్చిన ఈ విధానంతో కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. రెండేళ్లలోనే దాదాపు ఆరు వేల పరిశ్రమల స్థాపనకు దేశ విదేశాల నుంచి బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి... రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. వీటితో దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
విదేశీ పెట్టుబడులపై దృష్టి
రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. దాంతో చైనాలోని వివిధ కంపెనీలు తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. లియో గ్రూపు, షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక్కోటి వెయ్యి కోట్ల పెట్టుబడులతో విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమల స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మకేనా, సెల్‌కాన్ కంపెనీలు హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇక ఇదే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల శాఖకు అనుబంధంగా విదేశాల్లో కార్యాలయాలు (కంట్రీ డెస్క్‌లు) ఏర్పాటు చేసి.. పెట్టుబడులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. గల్ఫ్ దేశాలతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, మెక్సికో తదితర 12 దేశాల్లో కంట్రీ డెస్క్‌ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుతో అద్భుతమైన అవకాశం అందివచ్చింది. పెట్టుబడుల సమీకరణకు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలను పంచుకునే వేదిక కావటంతో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలు, హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక, వాతావరణ సానుకూలతలను చాటిచెప్పేలా ప్రణాళికలు రచిస్తోంది. పారిశ్రామిక విధానానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఐటీ పాలసీని సైతం ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ప్రసంగించనున్న కేసీఆర్, కేటీఆర్, టీహబ్ సీఈవో..
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కె.తారకరామారావు సదస్సులో ప్రసంగించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 28న ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఆహ్వాన ప్రసంగం చేయనున్నారు. అనంతరం ఇవాంకా, తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. మరుసటి రోజున దేశ విదేశీ ప్రతినిధుల సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. టీహబ్ సీఈవో జయదీప్ కృష్ణన్ సైతం చర్చాగోష్టిలో ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment