సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ కులాలను ఆకట్టుకునే వ్యూహాలకు ప్రభుత్వం పదును పెడుతోంది. వెనుకబడిన కులాల (బీసీల) అభివృద్ధి ప్రణాళికను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వం ఐదు అంశాలతో ఎజెండాను సిద్ధం చేసింది. ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీల్లోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీసీ సంక్షేమశాఖ ఆహ్వానించింది. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి ఈ భేటీలో విశ్లేషించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో నివేదికను ప్రదర్శించే అవకాశాలున్నాయి. దీంతోపాటు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ నివేదికను హ్యాండవుట్ల రూపంలో అందించనున్నారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో బీసీ కులాలకు ప్రభుత్వం నిర్దేశించిన నిధులు, కేటాయింపులు, వాటి అమలు తీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ప్రధానంగా నాయీ బ్రాహ్మణులకు రూ. 250 కోట్లు, రజకులకు రూ. 250 కోట్లు, ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు)లకు రూ. వెయ్యి కోట్ల మేరకు చేసిన కేటాయింపులపై సమావేశంలో చర్చించి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడంపై దృష్టి సారిస్తారు. అలాగే సంచార జాతులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి/శాలివాహన, ఇతర కులాల ఫెడరేషన్లు, వడ్డెర, సంగెర (ఉప్పర) వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ, పూసల, భట్రాజ, మేదర, గీత కార్మిక, ఇతర ఎంబీసీల అభివృద్ధిపైనా చర్చించనున్నట్లు ఎజెండాలో ప్రస్తావించారు. వీటితోపాటు ఫెడరేషన్ల భవిష్యత్తు ప్రణాళికలపై ఇందులో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల అనంతరం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం తప్ప ఎంబీసీల పరిధిలోకి వచ్చే కులాలేమిటో ఇప్పటివరకు గుర్తించలేదు. దీంతో నిధులేవీ ఖర్చు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంబీసీ కులాల గుర్తింపునకు అనుసరించాల్సిన ప్రాతిపదిక, ఏయే కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వంటి అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ముందుగా చెప్పినట్లుగానే...
గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల అభివృద్ధి ప్రస్తావన వచ్చిన సందర్భంలో డిసెంబర్ 3న అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికకు కసరత్తు చేస్తామని చెప్పారు. బీసీల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సలహాలను అందించాలని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు అదే రోజున సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరుగనున్న సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు ప్రస్తావించే అంశాలతోపాటు ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలను సీఎం ఈ సమావేశంలో ప్రకటించే అవకాశముంది.
మొత్తం 50 మందితో సమావేశం...
సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో బీసీ కులాలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎంపీలు పాల్గొననున్నారు. అలాగే స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, బీసీ కులాలకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. మొత్తం 50 మందితో సమావేశం జరిగేలా అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రి జోగు రామన్న శనివారం అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ను కలసి సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే పోలీసు అధికారులు స్పీకర్‌తో సమావేశమై బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment