సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, అప్పులు చేసి మరీ ప్రైవేటులో చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నా ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరం అవుతున్నారు. రాష్ట్రంలో 74.02 శాతం ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో కేవలం 46.82 శాతం మంది విద్యార్థులే చదువుతున్నారు. అదే ప్రైవేటు పాఠశాలలు 25.98 శాతమే ఉన్నా వాటిల్లో ఏకంగా 53.18 శాతం పిల్లలు చదువుకుంటున్నారు.
2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉండగా అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 28.33 లక్షల మంది (48.28 శాతం) చదివారు. అదే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 27.49 లక్షలకు 46.82 శాతం) తగ్గిపోయింది. అంటే మూడేళ్లలో 84 వేల మంది (1.46 శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరంలో 30.34 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 31.22 లక్షలకు పెరిగింది. ఇదే విషయాన్ని ‘సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్’కూడా స్పష్టం చేసింది. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనమండలిలో వెల్లడించిన అంశం ఇదే విషయాన్ని బలపరుస్తోంది.
సానుకూల చర్యల దిశగా అడుగులు...
ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరమే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగంలోనూ ఆంగ్ల మాధ్యమ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం గతేడాది ప్రారంభించింది. అయితే స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే టీచర్లు సిద్ధంగా ఉన్నారని, సరిపడా తరగతి గదులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు తీర్మానం చేసి పంపిస్తేనే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు అనుమతులు ఇస్తోంది. అయితే ఇకపై స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల తీర్మానంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేసే దిశగా అడుగుగులు పడుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో బీసీలే అత్యధికం..
రాష్ట్రంలోని సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 20,47,503 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో బీసీ విద్యార్థులే అత్యధికంగా 54.03 శాతం మంది ఉన్నట్లు ‘సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్’వెల్లడించింది. జనరల్ విద్యార్థులు 7.65 శాతం ఉంటే ఎస్సీలు 24.52 శాతం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఎస్టీలు 13.80 శాతం మంది, బీసీలు 54.03 శాతం మంది చదువుతున్నట్లు వివరించింది. మరోవైపు ఈ పాఠశాలల్లో చదువుతున్న వారిలో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ బీసీ బాలికలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై సీఎం ఏమన్నారంటే...
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు. నేనే ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశా. కూలి పని చేసుకునే మహిళ కూడా ఎంత ఖర్చయినా తమ పిల్లలను ప్రైవేటు స్కూల్‌కు పంపిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే అందులోనే చదివిస్తానని చెప్పింది. అందుకే విద్యావేత్తలు ఈ అంశాన్ని తేల్చాలి. బడ్జెట్ సమావేశాల తరువాత దీనిపై విద్యావేత్తలు, టీచర్ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించి ఓ విధానాన్ని రూపొందించండి. చివరగా నేను అందులో పాల్గొంటా. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై నిర్ణయం తీసుకుందాం’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment