టెన్త్‌ పరీక్షలు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana High Court Green Signal to Conduct 10th Class Exams - Sakshi
Sakshi News home page

తెలంగాణ: టెన్త్‌ పరీక్షలపై హైకోర్టు తీర్పు

Published Sat, Jun 6 2020 5:07 PM | Last Updated on Sat, Jun 6 2020 8:49 PM

Telangana High Court Green Signal To Tenth Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు అనుమతించాలని, వారిని రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణించాలని ప్రభుత్వానికి సూచించింది. విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైట్‌మెంట్‌ జోన్లుగా మారితే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఎలాంటి సమాధనం చెప్పలేదని తెలిపింది. జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

కాగా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సందర్భంగా తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement