సాక్షి, హైదరాబాద్ : వ్యభిచార కూపం నుంచి విముక్తి లభించి సంరక్షణ గృహాల్లో ఉన్న బాలికలను పెంపుడు తల్లులు కలుసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. యాదాద్రిలోని వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా దొరికిన పిల్లలను రక్షిత గృహాల్లో ఉంచారు. ఆ బాలికలను కలిసేందుకు అనుమతించేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తప్పిపోయిన, కిడ్నాపైన పిల్లలను బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దించుతున్నారని పేర్కొంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది. ఆ బాలికలను ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో ఉంచింది. తమ పెంపుడు పిల్లలను కలుసుకునేందుకు వెళితే పోలీసులు అనుమతించడం లేదని, పిల్లలను కలుసుకునేందుకు అనుమతించాలని పలువురు పెంపుడు తల్లుల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కొందరిపై క్రిమినల్ కేసులున్నాయి. వారు కలిస్తే పిల్లలపై ప్రభావం ఉంటుంది. పిల్లల్ని కలుసుకునేందుకు రాచకొండ కమిషనర్ ఎవ్వరినీ అనుమతించరాదు’అని ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment