అంత తొందరెందుకు..?  | Telangana High Court Question On Municipal Elections | Sakshi
Sakshi News home page

అంత తొందరెందుకు..? 

Published Thu, Jul 18 2019 6:24 PM | Last Updated on Fri, Jul 19 2019 8:10 AM

Telangana High Court Question On Municipal Elections - Sakshi

‘మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల పునర్విభజన అత్యంత ముఖ్యమైంది. ఈ పునర్విభజన ప్రక్రి యను హడావుడిగా ఎలా చేస్తారు? అభ్యంతరాలను సమర్పించేందుకు 4 రోజుల గడువునిచ్చారు. గడువు పూర్తికాక ముందే, ఒక్క రోజు లో అభ్యంతరాలను పరిష్కరిస్తారా..? భారీస్థాయిలో వచ్చే అభ్యంతరాలను ఒక్క రాత్రే పరిష్కరించడం మానవ మాత్రులకు సాధ్య మా? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. లేకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. ప్రపంచంలోనే మన ప్రజాస్వామ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని విస్మరిస్తే ఎలా? – హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని హైకోర్టు ధర్మాసనం నమోదు చేసుకుంది. వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు.. వాటిలో ఎన్ని పరిష్కరించారు.. తదితర వివరాలను కౌంటర్‌ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల గుర్తిం పు, వార్డుల పునర్విభజన, అభ్యంతరాల స్వీక రణ తదితరాలకు గడు వును నిర్దేశి స్తూ ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లాకు చెందిన న్యాయవాది అంజున్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గరువా రం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఆ హామీ ఏమైంది..? 
ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు 109 రోజుల సమయం అవసరమని సింగిల్‌ జడ్జి ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నరేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో సింగిల్‌ జడ్జి మరో 10 రోజులు అదనంగా కలిపి 119 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ప్రభుత్వం 30 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసిం దని నివేదించారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను కూడా చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోవట్లేదన్నారు. ధర్మాసనం స్పం దిస్తూ సింగిల్‌ జడ్జికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది.
 
ఇదే మొదటిసారి.. 
ఎన్నికలకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశా మని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వాకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు చెప్పారు. వార్డుల పునర్విభజన ఒక్కటే మిగిలి ఉందని పేర్కొన్నారు. 132 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్క రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సబబు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదంటూ ఎన్నికల సంఘం గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇలా ఓ ప్రభుత్వంపై ఎన్నికల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని వ్యాఖ్యానించింది.  ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది జి.విద్యాసాగర్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement