బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు   | Victims are about seven crore voters | Sakshi
Sakshi News home page

బాధితులు ఏడు కోట్ల మంది ఓటర్లు  

Published Thu, Mar 28 2019 3:03 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Victims are about seven crore voters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల డేటా చోరీ కేసులో బాధితులు ఎన్నికలు సంఘం, ఆధార్‌ సంస్థ కాదని, 7 కోట్ల మంది ఓటర్లని, వారి వ్యక్తిగత సమాచారాన్నే ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చోరీ చేసిందని సీని యర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కీలక సమాచారం తమ వద్ద ఉందన్న విషయంతో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌  విభేదించడం లేదన్నారు. ఇక్కడ ప్రధాన ప్రశ్నలు, ఎవరు చెబితే ఈ సమాచారాన్ని చోరీ చేశారు.. ఎవరి కోసం చోరీ చేశారు.. ఏం ఆశించి ఇలా చేశారన్నదే ముఖ్యమన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే కుట్ర మొత్తం బహిర్గతమవుతుందని ఆయన తెలిపారు. అందువల్ల నిబంధనల ప్రకారం బాధితుల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యాజ్యంలో కొత్తగా ప్రతివాదులుగా చేర్చబడిన ఎన్నికల సంఘం, ఆధార్, ఏపీ ఆధార్‌ నమోదు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నామంది. ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ అశోక్‌ దాఖలు చేసిన పిటిషన్ల విచారణార్హత, కేసు పూర్వాపరాలపై ఏప్రిల్‌ 22న విచారిస్తామంది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల డేటా చోరీకి సంబంధించి ఎస్‌ఆర్‌ నగర్, మాదాపూర్‌ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ బుధవారం విచారణ జరిపారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు పిటిషనర్‌ ఈ వ్యాజ్యాల్లో ఎన్నికల సంఘం, ఆధార్‌ సంస్థ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా డేటా చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డేటా చోరీ వెనుక భారీ కుట్ర ఉందన్నారు. పిటిషనర్‌ న్యాయవాది ఈ వ్యవహారంలో ఆధార్, ఎన్నికల సంఘాన్ని బాధితులుగా చెబుతున్నారని, వారు కేవలం ప్రజల సమాచారాని కి సంరక్షకులు మాత్రమేనని తెలిపారు. తమ సమాచారాన్ని కోల్పోయిన ఓటర్లే ఇక్కడ బాధితులన్నారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకే ఆధార్, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ, ముందు ఈ వ్యాజ్యాల విచారణార్హతను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తరువాత అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, రాజకీయ దురుద్దేశాలతో పిటిషనర్‌పై కేసులు నమోదు చేశారన్నారు. ఎన్నికల సంఘం, ఆధార్‌ వద్ద ఉండాల్సిన సమాచారం బహిర్గతమైందని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, ఇక్కడ ఆ రెండు సంస్థలే బాధితులని తెలిపారు. బాధితులైన ఆ సంస్థలు ఫిర్యాదు చేయలేదన్నారు. సమాచారం చోరీకి గురైందో లేదో ఈ సంస్థలే చెప్పాలని, అందువల్లే వారిని ప్రతివాదులు గా చేర్చామన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈసీని, ఆధార్‌ సంస్థను ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement