హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ కోసం, గ్రామ స్థాయి నుంచి జేఏసీని తెలంగాణ ఉద్యమ జేఏసీగా మలిచేందుకు గాను అంబేడ్కర్ జయంతి రోజైన గురువారం నుంచి ‘తెలంగాణ స్ఫూర్తి యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ వెల్లడించారు. ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపేందుకు సామాజిక శక్తులను ఐక్యం చేయడం యాత్ర ఉద్దేశమన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్ర ప్రారంభమై భువనగిరి చేరుకుంటుందని, అక్కడ నుండి ఈ నెల 29 వరకు తెలంగాణలోని 10 జిల్లాలు తిరిగి, తిరిగి హైదరాబాద్ చేరుకుని 30న ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాలు, సభ నిర్విహ ంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగ్ ప్రహ్లాద్ పాల్గొన్నారు.