
ఇంటర్ ఫలితాల వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 57 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 66.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల ఫలితాలు మెరుగయ్యాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
ఫస్టియర్‌లో పరీక్షకు 4,75,874 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,70,738 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ పరీక్షకు 4,18,213 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,75,273 మంది ఉత్తీర్ణలయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం మంది విద్యార్థులు 'ఏ' గ్రేడ్ సాధించగా.. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులకు 'ఏ' గ్రేడ్ వచ్చిందన్నారు.
ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో టాప్‌లో మేడ్చల్ జిల్లా నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి నిలిచింది. చివరిస్థానంలో మహబూబాబాద్ నిలిచింది. ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి, చివరిస్థానంలో నిర్మల్, గద్వాల్, మహబూబాబాద్‌లు నిలిచాయని కడియం శ్రీహరి తెలిపారు. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.