తెలంగాణ.. మినీ భారత్
- ఇదే ఇక్కడి ప్రత్యేకత: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఇది ఉత్తరాదివారికి దక్షిణ భారతం. దక్షిణాదివారికి ఉత్తర భారతం
- రాష్ట్రం విడిపోయింది ఒకరికి వ్యతిరేకంగా కాదు
- విడిపోయినా మనమంతా తెలుగువారమే
- ఇద్దరు సీఎంలు రాష్ట్రాలను ముందుకు తీసుకువెళ్లాలి
- అవినీతి, ఆకలి చావులు, అక్రమాలు లేని రాజ్యమే రామరాజ్యం
- అలాంటి రాజ్య స్థాపన కోసం నాయకులు కృషి చేయాలి
- రాష్ట్రం తరఫున ఘనంగా పౌర సన్మానం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ.. ఉత్తరాది వారికి దక్షిణ భారతదేశం. దక్షిణాది వారికి ఉత్తర భారత దేశం. అదే ఇక్కడి విశిష్టత. ఇక్కడి భాషలు, ప్రజల జీవన విధానాన్ని పరిశీలిస్తే మినీ భారత్ అని చెప్పవచ్చు’’ అని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ అభివృద్ధి పటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
‘‘ఈరోజు మనసు విప్పి చెబుతున్నా. రాష్ట్రం విడిపోయింది ఒకరికి వ్యతిరేకంగా కాదు. తమ రాష్ట్రాన్ని తాము పరిపాలించుకోవాలని, త్వరితగతిన అభివృద్ధి చెందాలని, తమకు రావాల్సిన న్యాయమైన వాటాను పొందాలన్న ఉద్దేశంతో ప్రజలు ఉద్యమించారు. కలసి కలహించు కోవడం కన్నా విడిపోయి సహకరించు కోవడమే మిన్నా అని ఆనాడే చెప్పా. ఇవాళ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రపంచం దృష్టిలో మనమంతా తెలుగువారమే’’ అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సమస్యలను అర్థం చేసుకుని రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని అభిలషించారు. ఒక కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలున్నట్లే రెండు రాష్ట్రాల మధ్య ఉంటాయని, అయినా ఇద్దరు సీఎంలు కలసి మెలసి పనిచేస్తూ రెండు రాష్ట్రాలను బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సోమవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ‘‘స్వరాజ్యం వస్తే సమస్యలన్నీ పరిష్కారమవు తాయని స్వాతంత్య్ర పోరాటం చేశారు. స్వరాజ్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా? అన్న విషయంపై రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులందరూ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆకలి, అవినీతి, అరాచకాలు, అక్రమాలకు తావు లేని, అందరికి సమాన అవకాశాలు కల్పించే సమాజం ఏర్పాటే అంతిమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రామరాజ్యం అంటే మత రాజ్యం కాదు. ఆకలి, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలసి ఉండే రాజ్యమే రాజ్యమని మహాత్మాగాంధీ చెప్పారు.
ఇలాంటి రామరాజ్యం స్థాపన కోసం అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సమ్మిళిత అభివృద్ధి జరిగితేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. దీన్ని సాధించడం అన్ని రాజకీయ పార్టీలు, నాయకుల బాధ్యత అన్న భావం అందరిలో నెలకొల్పాలి’’అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షాలు నెరవేరాలంటే అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపు మేరకు స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అంతా కలసి టీం ఇండియా స్ఫూర్తితో పని చేసి దేశాభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
ఎవరినీ కలవలేకపోతున్నా..
తెలిసిన వారిని అభిమానంతో, ఆదరణతో పలకరించకపోతే జీవితానికి అర్థం ఏమిటి అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ప్రొటోకాల్, భద్రత సమస్యల వల్ల తనను కలవడానికి వచ్చిన వారిని కలవలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన తనకు ఈ కొత్త బాధ్యతలు ఇబ్బందిగా మారాయని, త్వరలో పరిష్కారం కనుక్కుంటా నన్నారు. అసెంబ్లీలు, పార్లమెంట్ జరుగుతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాలక, ప్రతిపక్షాలు రాజ్యసభ సజావుగా నడిచేందుకు సహకరించాల్సి ఉంటుందన్నారు.
పోరాటాల గడ్డ తెలంగాణ
పద్యం, గద్యం వినే అవకాశం ఈ రోజుల్లో తగ్గిపోతోందని, ఈ కార్యక్రమాన్ని చక్కగా, సాహిత్య, సంస్కృతి, సాంప్రదాయ బద్ధంగా ఏర్పాటు చేయడం సంతోషం కలిగించిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్థానిక మాండలిక భాషలో ప్రసంగించిన తీరు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సాహిత్యానికి, సంస్కృతికి ప్రాణపదమైన నేల తెలంగాణ అని కొనియాడారు. ఈ నేల అడుగున ప్రతిఘటన, పోరాటాల చరిత్ర ఉందని, స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిందని కొనియాడారు. కుమ్రం భీం, సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మలు ఇక్కడి పోరాట స్ఫూర్తికి తార్కాణాలని పేర్కొన్నారు.
అక్రమాన్ని, అన్యాయాన్ని ఎవరు ఎదిరిస్తారో వారే నా ఆరాధ్య దేవుళ్లు అని ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు అన్న విషయాన్ని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. తెలంగాణ సంస్కృతి విస్తృతమైనదని, బతుకమ్మ, బోనాలు ఇక్కడి విశిష్టమైన పండుగలన్నారు. రుచులు కూడా భిన్నమైనవని, ఇక్కడి బిర్యానీ, హలీం ప్రపంచ ఖ్యాతిగాంచాయని అన్నారు. ఆ పక్కన వెళ్తే నెల్లూరు చేపల కూర కూడా అంతే ప్రసిద్ధి గాంచిందని చెప్పారు.
నేను వెళ్లని మండలం లేదు..
తెలంగాణ నేలలో తాను ఎక్కువ తిరిగానని, పుట్టింది నెల్లూరులో చదివింది విశాఖపట్నంలో అయితే రాజకీయంగా పెరిగింది ఎదిగింది హైదరాబాద్‌లోనే అని వెంకయ్య అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 1977లో హైదరాబాద్‌కు వచ్చానని, దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నానని చెప్పారు. ‘‘ఈ నగరం అన్నా, తెలంగాణ ప్రాంతం అన్నా ఎంతో ఇష్టం. ఇక్కడ నేను పర్యటించని తాలూక, మండలం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి ప్రజలు, విభిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలకు ప్రతీక. కేంద్రమంత్రి దత్తాత్రేయ అలయ్ బలయ్ పేరుతో ఈ సంప్రదాయాన్ని ఉత్సవంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
ఎవడయ్యా వాడు.. తెలుగువాడు..
‘‘మన కట్టుబొట్టూ, ఆటాపాటా, మన భాష, మన ధ్యాస, మన గోసలను కాపాడుకోవాల్సిన అవసరముంది. తెలుగు భాషలో సౌందర్యముంది. తెలుగువాడికి ప్రత్యేకత ఉంది’’అని వెంకయ్య అన్నారు. ఈ సందర్భంగా తెలుగువాడిపై సినారె రాసిన ‘పంచె కట్టులో ప్రపంచంలోనే మొనగాడు.. కండువా లేనిదే గడపదాటని వాడు.. పంచభక్ష్యాలు కంచాన వడ్డించినా గోంగూర పచ్చడికై చూసేవాడు.. ఎవడయ్యా ఎవడు వాడు.. ఇంకెవడయ్యా తెలుగువాడు..’ పంక్తులను గుర్తుచేసుకున్నారు.
‘‘నేను తెలుగు రాష్ట్రాల సీఎంలను రెండు విషయాలే కోరుకుంటున్నా. ఒకటి వారిద్దరూ కలసి పని చేయాలి.. రెండోది తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని అన్నారు. ‘‘ఆంగ్లం ఓ వ్యాధిలా మారింది. ఆ భాషకు నేను వ్యతిరేకం కాదు. అయితే విద్యా బోధన ఏ భాషలో జరిగినా మాతృభాష తెలుగు ఓ సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగం రావాలంటే తప్పనిసరిగా తెలుగు చదివి ఉండాలి. ప్రజలకు అర్థమైన భాషలో పరిపాలన సాగాలి. పాలనా భాషగా, వ్యావహారిక భాషగా తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని అన్నారు.