సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తాము 2040 వరకూ తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతిపై వెళ్లలేమని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. జిల్లా న్యాయమూర్తులు, ఇతర సబార్డినేట్ సర్వీసుల్లో ఉన్న న్యాయాధికారుల విభజనకు సంబంధించిన వివాదంపై బుధవారం తన వాదనలు కొనసాగించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వరుసగా రెండో రోజూ కేసును విచారించింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3, 4 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారానే విభజన జరగాలి. న్యాయాధికారుల విభజన కూడా అలాగే జరగాలి. కానీ ఆర్టికల్ 235 ప్రకారం సబార్డినేట్ కోర్టులు హైకోర్టు నియంత్రణలో ఉన్నాయి కాబట్టి.. విభజన కూడా ఆర్టికల్ 235 ప్రకారమే జరగాలంటే ఎలా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ 235 ఎలా వర్తిస్తుంది? కేంద్రం హైకోర్టుతో సంప్రదింపులు జరపవచ్చు. కానీ అంతిమంగా పునర్‌వ్యవస్థీకరణ చట్టం పరిధిలోనే కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలి. అసలు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి స్థానికతే గుండెకాయ. స్థానికత లేకుండా కేవలం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే మేం 2040 వరకూ కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందలేం’’అని హుజేఫా అహ్మదీ వాదించారు.
ఫుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది: హైకోర్టు రిజిస్ట్రీ
హైకోర్టు రిజిస్ట్రీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి తన వాదన వినిపించారు. ‘‘పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 78 గానీ, మరొకటి గానీ న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు. వీరు సవాలు చేసిన తీర్పు ఫుల్ కోర్టు ఇచ్చినది. మీరు సీనియారిటీని ఎలా విస్మరిస్తారు? సర్వీసు కండిషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆప్షన్లు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల వారు తరాలుగా వచ్చి స్థిరపడి ఉన్నారు. వారిని కాదంటే ఎలా? సీనియారిటీ ద్వారానే కేటాయింపులకు న్యాయం జరుగుతుంది’’అని వాదించారు.
అప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు?: ఏపీ న్యాయాధికారుల సంఘం
ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వై.రాజగోపాలరావు తమ వాదనలు వినిపించారు. ‘‘ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 నుంచి 80 వరకు ఏవీ కూడా న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు’’అని ఆదినారాయణ రావు వాదించారు. దీనికి జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘ఈ చట్టం ద్వారా విభజన చేపట్టవచ్చని హైకోర్టు అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.. మరి మీరెందుకు అంగీకరించడం లేదు’’అని ప్రశ్నించారు. ఆదినారాయణరావు బదులిస్తూ ‘‘ఈ చట్టం ఆధారంగా విభజనకు హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వలేదు. కేవలం ఆర్టికల్ 235 ద్వారా సంక్రమించిన అధికారాలతోనే మార్గదర్శకాలను రూపొందించింది’’అని పేర్కొన్నారు.‘‘సుప్రీంకోర్టు 1993లో ఆలిండియా జడ్జెస్ కేసులో ఇచ్చిన తీర్పు గానీ, ఇతర తీర్పులు గానీ పరిశీలిస్తే న్యాయవ్యవస్థలోకి ఏనాడూ కార్యనిర్వాహక వ్యవస్థ చొరబడేందుకు అనుమతివ్వలేదు. పిటిషనర్లు చెబుతున్నట్టు 371డీ న్యాయవ్యవస్థకు అమలు కాదు.
అలా అమలైతే ప్రాంతాల వారీగా రిజర్వేషన్ వర్తించేది. కానీ ఈ సర్వీసులో అఖిల భారత స్థాయిలో ఎవరైనా పోటీపడొచ్చు. వారన్నట్టుగా స్థానికతే ప్రాతిపదిక అయితే ప్రస్తుతం ఈ సర్వీసులో తెలంగాణలో, ఏపీలో పనిచేస్తున్న తమిళనాడు వారినో లేదా కర్ణాటక వారినో ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నివాసం ఎక్కడ అనేది ఒక ప్రాతిపదికే కాదు. నియామకం సమయంలో ప్రాతిపదికగా లేని స్థానికతను ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవాలి’’అని వాదించారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటివరకు జరిగిన వాదనలపై కేసులోని అన్ని పార్టీలు తమ ప్రతిస్పందనలను ఆగస్టు 31 లోపు లిఖితపూర్వకంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయకుమార్ సాగర్ వాదనలు వినిపించారు. ఏపీ న్యాయాధికారుల సంఘం ప్రతినిధి గంటా శ్రీనివాసులు, తెలంగాణ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వరప్రసాద్, చంద్రశేఖర్ విచారణకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment