సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల్లో కీలకమైన మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీపీ పదవులను సొంతంచేసుకోవాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్యాంప్‌లు జోరుగా నిర్వహిస్తున్నాయి. క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను శుక్రవారం నేరుగా ఎన్నిక నిర్వహించే మండల పరిషత్ కార్యాలయాలకు తరలించేందుకు ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని మండలాల్లో ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఇరుపార్టీలకు ఉన్నా.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని ముందు జాగ్రత్తగా ఎంపీటీసీలను ఒక చోటుకు చేర్చారు. ఇంకొన్ని మండలాల్లో సంఖ్యాబలం లేకున్నా ఎంపీపీ పీఠాలను సొంతం చేసుకునేందుకూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు క్యాంప్ నిర్వహించాయి. కొన్నిచోట్ల కీలకంగా మారిన చిన్నాచితక పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో ఆయా పార్టీలు బేరసారాలు జరుపుతున్నాయి. జిల్లాలో 21 మండలాల్లో 9 ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది.
ఇక.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్న మండలాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. ఆ స్థానాలను చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ ఆకర్‡్ష మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఎంపీపీ స్థానాలపై గురిపెట్టింది. ఇప్పటివరకు అబ్దుల్లాపూర్‌మెట్ మాత్రమే ఆ పార్టీ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిపోను చేవెళ్ల, మంచాల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, మాడ్గుల, కడ్తాల్, యాచారం, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక్కడ అధికార పార్టీ ఎంపీటీసీలకు కూడా గాలం వేసినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఎంపీపీ పదవి సైతం కట్టబెడతామన్న ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక బీజేపీ.. మహేశ్వరం, కందుకూరు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్ ఎంపీటీసీలను, స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కోఆప్షన్ సభ్యులకు పోటాపోటీ..
ప్రతి మండలానికి ఒకరి చొప్పున కోఆప్షన్ సభ్యునిడిని ఎన్నుకుంటారు. ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీటీసీలతోపాటు సమానంగా వీరికి గౌరవం లభిస్తుండటం, గౌరవ వేతనం అందుతుండడం.. సర్వసభ్య సమావేశాల్లో సైతం చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండటం తదితర సానుకూలతల నేపథ్యంలో ఈ పదవులను కోరుకుంటున్నారు. వీరికి ఓటు హక్కుమాత్రం ఉండదు. స్థానిక మండలంలో ఓటరుగా నమోదై ఉంటే ఈ పదవికి అర్హులు. ఈ క్రమంలో కోఆప్షన్ పదవుల కోసం పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాపరిషత్‌లో కోఆప్షన్ సభ్యులు ఇద్దరు ఉంటారు.
అన్నింటికీ కోరం తప్పనిసరి
కోఆప్షన్ సభ్యుని ఎన్నికతోపాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు కోరం తప్పనిసరి. మండల పరిధిలోని మొత్తం ఎంపీటీసీల్లో కనీసం 50 శాతం సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. తగిన కోరం లేకుంటే ఎన్నికను మరుసటి రోజుకు ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారు. ఆ తర్వాత రోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం ఓ తేదీని సూచిస్తుంది. ఆ రోజున కోరం లేకున్నా ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు.
ఆ మూడు చోట్ల తాత్కాలిక భవనాల్లో..
మూడు మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు తాత్కాలిక భవనాలను సిద్ధం చేశారు. కొత్తగా మండలాలుగా ఏర్పడిన నందిగామ, కడ్తాల్, చౌదరిగూడలో మండల పరిషత్ భవనాలు లేవు. ఈ నేపథ్యంలో ఎంపీపీల ఎన్నికకు అందుబాటులో ఉన్న భవనాలను తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. నందిగామలో జిల్లా పరిషత్ హైస్కూల్‌లో, కడ్తాల్, చౌదరిగూడ మండలాల్లో స్థానిక గ్రామ పంచాయతీ భవనాల్లో ఎన్నిక జరుగుతుంది.
రేపు జిల్లాపరిషత్ ఎన్నిక
ఇక జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా.. ఎంపీపీల ఎన్నిక తరహాలోనే జరుగుతుంది. లక్డీకపూల్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment