తెలంగాణపై తెరచాటు కుట్రలు
హన్మకొండలో విద్యార్థి ఉద్యమ యాది సభలో కవి దేశపతి
హన్మకొండ: తెలంగాణపై తెరచాటు కుట్రలు చేస్తున్నారని కవి, గాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం హన్మకొండలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ యాది సభ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. సభలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థ కుట్రలను కొనసాగిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు ఏం సాధించుకున్నారనేది కాకుండా సీమాంధ్రులకు ఏం కోల్పోయారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోచుకుపోయినవన్ని నిలిచిపోయాయని, నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా తీసుకోగలిగామన్నారు. అభివృద్ధిలో ముందు భాగాన ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక కుట్రలు సాగిస్తున్నారన్నారు.