Deshapathi Srinivas
-
TS: నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్, వెంకట్రామ్రెడ్డి, నవీన్ కుమార్ నామినేషన్ వేశారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. మరోవైపు.. నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత అభ్యర్థుల ఫైల్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు వెళ్లనుంది. ఇక, ఎమ్మెల్సీలు డీ. రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం ముగియనుంది. ఈ ఇద్దరిలో ఒకరు క్రిస్టియన్ మైనారిటీ కాగా, మరొకరు ముస్లిం మైనారిటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి మైనార్టీకే అవకాశం ఇవ్వాలనుకుంటే రాజేశ్వర్ రావు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఉదంతం కారణంగా ఈసారి అధికార పార్టీ అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష్మయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, పీఎల్. శ్రీనివాస్ ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీసీ, ఇతర సామాజిక వర్గాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. -
మండలికి గోరెటి వెంకన్న, దేశపతి!
సాక్షి, హైదరాబాద్ : త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. మూడు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగినే కేబినెట్లో చర్చించిన అనంతరం జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో కవి గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. (గ్రేటర్లో గెలవాల్సిందే) తెలంగాణ ఉద్యమ సమయమంలో గోరెటి వెంకన్నతో పాటు, దేశపతి శ్రీనివాస్ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసింది. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుతూ బస్వరాజు సారయ్య టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒకపదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఈసారి అవకాశం దకొచ్చని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు గుజరాతీ సామాజికవర్గానికి చెందిన వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేటి మంత్రిమండలి భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. -
మరోసారి ఝలక్ ఇచ్చిన ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ వైఖరి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రి కొద్దికాలం మౌనంగా ఉన్నా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓఎస్డీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు ఈటల రాజేందర్‌కు మధ్య ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సభ నుంచి బయటకు వచ్చిన ఈటెల.. ఎమ్మెల్యే గాదారి కిషోర్‌తో కలిసి వెళ్తున్నారు. ఈ సమయంలోనే అక్కడున్న దేశపతి.. మీతో రావచ్చా సర్ అంటూ రాజేందర్‌ను పలకరించే ప్రయత్నం చేశారు. దీనికి స్పందించిన మంత్రి ఇప్పుడు నా అవసరం మీకేముందయ్యా అంటూ ఊహించని రీతిలో సమాధానమిచ్చారు. దీంతో దేశపతి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈటల సమాధానమిన్న అక్కడి వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో రాజేందర్ వ్యాఖ్యలు మరోసారి టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చదవండి: బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలో అసంతృప్తి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం ఉగ్రరూపం దాల్చి.. ఎవరో ఫోన్ చేస్తే సాయంత్రానికి చల్లబడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేతలు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదన్నారు ‘‘తాజ్‌మహల్‌కు రాళ్లెత్తినోళ్లు ఓనర్లు కారని ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. అలా అనడం శ్రామిక వర్గాన్ని అవమానించడమే. ఈ విషయం ఆయనకు కూడా చెప్పాను. జర్నలిస్టులు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలను మరింత చైతన్యవంత చేయాలి’ అని పేర్కొన్నారు. రచ్చ చేసుకోవద్దు: ఎమ్మెల్యే భాస్కర్ రావు అందరికి పదవులు కావాలంటే సాధ్యం కాదు. పదవులు కోరి రాకుంటే బాధ ఉండటం సహజం. మనలో ఎవరికి వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.. అరికపూడి గాంధీ మంత్రి పదవి కావాలి అనుకున్నాడు. గాంధీని తుమ్మల నాగేశ్వరరావు, నేనూ ఇంటికి పిలిచి గట్టిగా మందలించాము. ఇప్పుడు అంతా సద్దుమణిగింది.. మాలో ఎవరికొచ్చినా ఒకటే. జిల్లాలో అందరిని కలుపుకుపోవలని చెప్పాము. విప్ పదవి పట్ల గాంధీ హ్యాపీగా లేరు. ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వతంతో చర్చించి.. పరిష్కరించుకోవాలి. కానీ రచ్చ చేసుకోవద్దు. ప్రగతి భవన్‌లోకి అనుమతిపై.. ప్రగతి భవవన్‌లోనికి అనుమతించక పోవటంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. ‘గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సమావేశానికి నాకు ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు చేయబోయి పొరపాటున ఫోన్ నాకు వచ్చింది. ఆ విషయం తెలియక నేను ప్రగతి భవన్ కు వెళ్ళాను. ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన అనంతరం నాకు విషయం తెలిసింది. జరిగిన పొరపాటులో వాళ్ళ తప్పేమీ లేదు. తలసాని సాయికిరణ్ మంత్రి తలసాని కుటుంబ సభ్యుడుగా వెళ్లి ఉంటారు’ అని వివరణ ఇచ్చారు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు. తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది. బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ. చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204 -
పెద్దన్న తెలియాలి.. సోమన్న మరుగునపడొద్దు
కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని తాను అనుకోవడం లేదనీ; అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదనీ దేశపతి శ్రీనివాస్ అంటున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మహాసభల కోర్ కమిటీ సభ్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్న దేశపతితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఎడ్మినిస్ట్రేషన్ మీలోని సృజనకారుడిని ఇబ్బంది పెట్టడం లేదా? ఇబ్బంది పెడుతోంది. హద్దులు ఏర్పడతాయి; మనదైన స్పేస్ తగ్గిపోతుంది. సృజనకు అవసరమైన ఉత్ప్రేరణ తగ్గిపోతుంది. అయినా ఏదో ఒక మేరకు సాహిత్యకారులతో సంభాషణలో ఉండటం వల్ల నా సృజనను సజీవంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఏ క్రియేటివ్ ప్రాసెస్ నడుస్తోంది మీలో ఇప్పుడు? తెలంగాణ సాహిత్య మూర్తులు జగజ్జేయమానంగా వెలుగొందాలంటే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాక, తెలంగాణ సాహిత్య వైభవం సాక్షాత్కరించేలా పాటలు రాయడం మొదలుపెట్టాను. ఉదాహరణకు(పాడి వినిపించారు), ‘మన తెలంగాణము తెలుగు మాగాణము/ పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము/ చరితకు తొలి తెలుగందము జినవల్లభు కందము/ పంపకవిలో ప్రతిఫలించె తెలుగన్నడ బంధము/ నన్నయ కన్నా మున్నే ఉన్నదిచట ఛందము/ మల్లియరేచన చల్లిన మరుమల్లెల గంధము’. మనకు రాజకీయ నాయకుల హోర్డింగులు పెట్టడమే తెలుసు. కానీ సాహిత్యమూర్తులను హైదరాబాద్ అంతటా హోర్డింగుల్లో నిలిపితే వారి ప్రశస్తీ, భాష కోసం వారు చేసిన కృషీ ఫోకస్ అవుతాయి. వారి కోసం రాస్తున్న పంక్తులే ఒక సృజనకారుడిగా నా లోపల ఇప్పుడు సుడులు తిరుగుతున్నాయి. ఎవరెవరి పేర్లతో తోరణాలు నిలపాలన్న ఎంపిక పూర్తయ్యిందా? హాలుడి నుంచి ఆధునిక వైతాళికుల వరకు ఇప్పటికి 63 మంది తోరణాలు డిజైన్ చేయడం పూర్తయ్యింది. ఇంకా ఈ సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది. పంక్తులు, పాటలు రాయడానికి వాళ్లను ఎంతమేరకు మీలోపలికి తీసుకున్నారు? ఒక కవిని ఆయన భాషలోనే, ఆయన హృదయంతోనే, ఆయన దృక్పథంతోనే, ఆయన భావుకతతోనే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఉదాహరణకు రామదాసును తలుచుకోగానే భద్రాద్రి ఆలయం, కీర్తనలు స్ఫురణకొస్తాయి. కానీ ఆయన తెలుగులో భజనగీత సృజనకు ఆద్యుడు. త్యాగరాజుకు కూడా ప్రేరణగా నిలిచినవాడు. అందుకే, ‘తేనెలొలుకు తెలుగులోన/ భజనగీత సృజనమునకు/ ఆద్యుడైన రామదాసు/ భక్త శ్రేష్ఠుడు... రాగరాజు త్యాగరాజు/ వినయమొప్ప వినుతించిన/ విబుధవరుడు రామదాసు/ వందనీయుడు’ అన్నాను. కోర్ కమిటీ సభ్యుడిగా ఈ మహాసభలు ఏం సాధించగలవని మీరు భావిస్తున్నారు? ఒకటి: ఇన్నాళ్లూ తెలంగాణ భాష మీద దాడి జరిగింది. ఉపేక్ష భావం, చిన్నచూపు ఉండినాయి. ఏ భాషైనా గానీ అక్కడి భౌతిక చారిత్రక రాజకీయ ఆర్థిక పరిస్థితుల వల్ల రూపొందుతుంది. భాష అనేది జ్ఞాపకాల నిధి. అది ఇద్దరు వ్యక్తులు కేవలం భావాలు పంచుకొనే సాధనం మాత్రమే కాదు. భాషలో అక్కడి మట్టి వాసన, వారి స్మృతులు, సాంస్కృతిక వాతావరణం అన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజల్లో తమ భాష పట్ల ఒక ఔన్నత్య భావన ఈ మహాసభలు ఏర్పరచగలవు. రెండు: తెలుగు భాషలో ఏమాత్రం అభినివేశం లేని పిల్లల తరం రావడం ఇప్పటి విషాదం. వీరికి మాతృభాష పట్ల ఒక విశాల దృష్టి ఏర్పడుతుంది. తెలుగుకు చరిత్ర, విస్తృతి, వైశిష్ట్యం ఉన్నాయి; కవులకూ భాషావేత్తలకూ సమాజంలో గౌరవం ఉంది, అని వారికి తెలుస్తుంది. మూడు: ఆధునిక అవసరాలకు తెలుగును ఎలా విస్తరించాలో చేయాల్సిన ఆలోచనకు ఈ సభలు ఒక ప్రేరణ ఇవ్వొచ్చు. ఐదు నుంచి పదేళ్ల తర్వాత తెలుగు భవిష్యత్ చిత్రం ఎలా వుండబోతోందని మీ ఊహ? ఛానళ్ల తరం, ఐటీ తరం, అమెరికా తల్లిదండ్రుల తరం, నలబై అంటే ఇంగ్లీషులో ఎంత అనే తరం వచ్చాయి. వీరికి తెలుగులోని మౌలికాంశాలు తెలియదు. అయినప్పటికీ ఒక భాషగా తెలుగు అంతరించిపోతుంది, ఉండకుండా పోతుంది అనైతే నేను అనుకోవడం లేదు. గ్రామాల్లో ఏ నాట్లు వేసే స్త్రీ, ఏ కలుపుతీసే స్త్రీ ముందర నిలబడి దోసిలి పట్టినా భాషా భిక్ష పెడుతుంది. అయితే, కోర్టులో సాక్షి తెలుగులో చెబితే దాన్ని ఇంగ్లీషులో అనువాదం చేసి నమోదు చేస్తారు. అలా వుండకూడదు. పరిపాలనకూ, వ్యవహారానికీ మొత్తంగా తెలుగును ఉపయోగించే రోజులు రావాలి. అదేదో సెంటిమెంటుగా కాదు, ప్రజల అవసరం కోసం తెలుగును ఉపయోగించాలి. దానికోసం నా స్థాయిలో నేను కృషి చేస్తాను. కేసీఆర్‌ను దగ్గరినుంచి చూసినవాడిగా– తెలుగుకు తనను తాను ఒక ఛాంపియన్‌గా నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఏమైనా ఆయనలో కనబడిందా? లేదు. ఆయన పద్యాన్ని ప్రేమించినవారు. రాజకీయ ఉపన్యాసాలకు కూడా సాహిత్య పరిమళం అద్దినవారు. ఎన్నో సభల్లో– ‘ఆరంభించరు నీచమానవులు’ అంటూ భర్తృహరి సుభాషితం చెప్పారు. మొన్న (ఉప రాష్ట్రపతి) వెంకయ్యనాయుడు అభినందన సభలో కూడా ‘చదువది ఎంత కలిగిన’ పద్యం చెప్పారు. తెలంగాణలో ప్రకాశితమైన ఉద్యమ సాహిత్యం, జానపద సాహిత్యం గుర్తింపునొందాయి. కానీ శిష్ట సాహిత్యం, ఇతర సాహిత్య ప్రక్రియల మీద ఇంకా చర్చ జరగవలసేవుంది. తెలంగాణ భాషను తెలుగు భాషాభిమానులందరూ ప్రేమించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనంటే సద్భావన, ప్రశంసే ఉన్నాయి. కాబట్టి కొత్త కీర్తి కోసం అయితే ఈ మహాసభల్ని ఆయన తలపెట్టలేదు. తెలంగాణలో జరుగుతున్న మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ వైతాళికుల తోరణాలు నిలబెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? ఇంతకాలం ఏం జరిగిందంటే– తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యం విస్మరణకు గురైంది. తెలుగు సాహిత్య సంపూర్ణ దర్శనం జరగాలంటే ఈ నేల మీద జరిగిన కృషి కూడా అందులో చేరాలి. కవిత్రయం తెలియకుండా, అల్లసాని పెద్దన తెలియకుండా తెలంగాణవాళ్లు ఉండాలని నేను అనుకోవడం లేదు. అలాగని పాల్కురికి సోమన్న మరుగునపడకూడదు. పద్యానికి జాషువా అద్దిన మానవతా పరిమళాన్ని ఎలా విస్మరించగలం! ఆ తప్పు ఇప్పుడు మనం చేయకూడదు. అందుకే, తెలుగు సాహిత్యంలో మైలురాళ్లు అనదగిన ఆంధ్ర వైతాళికులకూ తోరణాలు కడుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో తెలుగు అంటేనే ఒక కానిమాటగా చూసిన ధోరణి ఉండింది. ఇప్పుడు అదే తెలుగు సభల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడాన్ని ఎలా చూడాలి? ఉద్యమకాలంలో కొన్ని అతివ్యాప్తులుంటాయి. తెలుగంటే వాళ్లది, తెలంగాణ భాష అంటే మనది అనే ఒక వాదన ఉండింది. తెలుగు తల్లి అనే భావన గతంలో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంతో ముడిపడినదిగా చూపబడింది. నిజానికి అది భాషా స్వరూపం. అందుకే రాష్ట్రం విడిపోయాక భౌతిక వాస్తవం పలుచనబడి, తెలుగు తల్లి అనే భావన తటస్థత పొందింది. ఆ ప్రతీకతో ఇప్పుడు తెలంగాణకు నిమిత్తం లేదు. తెలంగాణలో అందమైన తెలుగు మాట్లాడుతారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఇది పుట్టినిల్లు. బీజప్రాయం నుంచి శాఖోపశాఖలుగా తెలుగు విస్తరించిన నేల ఇది. తెలంగాణ నుడికారం, సామెతలు, శబ్దజాలం వీటన్నింటికీ పట్టంకట్టాల్సిన సమయం వచ్చింది. -
తెలంగాణపై తెరచాటు కుట్రలు
హన్మకొండలో విద్యార్థి ఉద్యమ యాది సభలో కవి దేశపతి హన్మకొండ: తెలంగాణపై తెరచాటు కుట్రలు చేస్తున్నారని కవి, గాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం హన్మకొండలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ యాది సభ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. సభలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారి వ్యవస్థ కుట్రలను కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు ఏం సాధించుకున్నారనేది కాకుండా సీమాంధ్రులకు ఏం కోల్పోయారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోచుకుపోయినవన్ని నిలిచిపోయాయని, నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా తీసుకోగలిగామన్నారు. అభివృద్ధిలో ముందు భాగాన ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక కుట్రలు సాగిస్తున్నారన్నారు. -
అహింసే ఆయుధం!
తెలంగాణ ఉద్యమ చరిత్రనూ, దాని నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తనిష్క మల్టీ విజన్ పతాకంపై గుజ్జ యుగంధర రావు నిర్మించిన చిత్రం ‘బందూక్’. దేశపతి శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, మిధున్‌రెడ్డి, సెహరా బాను ముఖ్య తారలుగా లక్ష్మణ్ మురారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో పాల్గొన్న గాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘‘ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి చేసిన తెలంగాణ పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించారు’’ అన్నారు. ‘‘ఆయుధంతో చేసే పోరాటం కన్నా, అహింస గొప్పద నే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్. శంకర్, నందిని సిద్ధారెడ్డి, రామ్మోహన్, అమరేందర్ త దితరులు పాల్గొన్నారు. -
అధికారుల గ్యాలరీలో ‘దేశపతి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూర్చునే స్థానానికి ఎడమ వైపు ఉన్న అధికారుల గ్యాలరీలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రత్యక్షమయ్యారు. గురువారం శాసనసభ నడుస్తున్న సమయంలో అధికారుల గ్యాలరీలో ప్రభుత్వం నియమించిన సలహాదారులు కేవీ రమణాచారి, జీఆర్‌రెడ్డి, ఏకే గోయల్, రామలక్ష్మణ్, విద్యాసాగర్లతోపాటు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌లు ఆశీనులయ్యారు. వీరి మధ్యలో దేశపతి శ్రీనివాస్ ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవంగా ఆ గ్యాలరీలో కేవలం అధికారులు కూర్చుని సభలో చర్చ సందర్భంగా మంత్రులు, ముఖ్యమంత్రికి తగిన సమాచారం అందిస్తుంటారు. దేశపతి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయకుడిగా నియమించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఏవీ వెలువడకపోవడం గమనార్హం. -
చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ
హైదరాబాద్: నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన సకల జనభేరి సభలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తన ప్రసంగంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి చెప్పిన కథకు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ‘‘ప్రస్తుతం ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు అటూ, ఇటూ తిరుగుతూ ఒక పిచ్చోడికి తారసపడ్డారట. చంద్రబాబును చూసి నువ్వు ఎవ్వరివి అని ఓ పిచ్చోడు ప్రశ్నించగా.. నేను చంద్రబాబునని బదులిచ్చాడు. ఏ చంద్రబాబువి అని పిచ్చోడు తిరిగి ప్రశ్నిస్తే ‘అదే, హైదరాబాద్ కట్టిన చంద్రబాబునని’ చెప్పాడట. చంద్రబాబు మాటలు విన్న పిచ్చోడు.. ‘ఆహా! త్వరలోనే తగ్గిపోతుంది. నేను కూడా కొద్దిరోజుల క్రితం వరకు ఢిల్లీ గురించి ఇట్లానే చెప్పేవాడిని’ అన్నాడట’’ అని దేశపతి చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగింది.