
అధికారుల గ్యాలరీలో ‘దేశపతి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూర్చునే స్థానానికి ఎడమ వైపు ఉన్న అధికారుల గ్యాలరీలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రత్యక్షమయ్యారు. గురువారం శాసనసభ నడుస్తున్న సమయంలో అధికారుల గ్యాలరీలో ప్రభుత్వం నియమించిన సలహాదారులు కేవీ రమణాచారి, జీఆర్‌రెడ్డి, ఏకే గోయల్, రామలక్ష్మణ్, విద్యాసాగర్‌లతోపాటు ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌లు ఆశీనులయ్యారు. వీరి మధ్యలో దేశపతి శ్రీనివాస్ ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవంగా ఆ గ్యాలరీలో కేవలం అధికారులు కూర్చుని సభలో చర్చ సందర్భంగా మంత్రులు, ముఖ్యమంత్రికి తగిన సమాచారం అందిస్తుంటారు. దేశపతి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయకుడిగా నియమించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఏవీ వెలువడకపోవడం గమనార్హం.