
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్ కుమార్ నామినేషన్ వేశారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
మరోవైపు.. నేడు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత అభ్యర్థుల ఫైల్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్దకు వెళ్లనుంది. ఇక, ఎమ్మెల్సీలు డీ. రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ పదవీకాలం ముగియనుంది. ఈ ఇద్దరిలో ఒకరు క్రిస్టియన్ మైనారిటీ కాగా, మరొకరు ముస్లిం మైనారిటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి మైనార్టీకే అవకాశం ఇవ్వాలనుకుంటే రాజేశ్వర్ రావు వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఉదంతం కారణంగా ఈసారి అధికార పార్టీ అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష్మయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, పీఎల్. శ్రీనివాస్ ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా బీసీ, ఇతర సామాజిక వర్గాలతో భర్తీ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment