సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటాలోని 12 ఖాళీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 23న ముగియనుంది. స్థానిక సంస్థల్లో సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఉండటంతో ఈ ఎమ్మెల్సీ పదవులన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోనే చేరే అవకాశముంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండురోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు.
దీంతో ఆ పదవులు ఆశిస్తున్న పార్టీ నేతలు అధినేత దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ దీనిపై కీలక సమావేశం నిర్వహించారు. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆయా ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు.
జిల్లాల వారీగా ఈ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతలు, త్వరలో పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్సీల పనితీరుపై చర్చించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్‌ఎస్ పక్షాన ఎంత మంది ఉన్నారో జిల్లాల వారీగా సమీక్షించారు. విపక్షాల పార్టీలతో పాటు మరికొందరు కూడా బరిలో దిగే అవకాశముండటంతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. వచ్చే నెల 10న పోలింగ్ జరగనుండటంతో అవసరమైతే ఓటర్లను క్యాంపులకు తరలించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది.
సిట్టింగ్‌లతో పాటు భారీ సంఖ్యలో ఆశావహులు
శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను ప్రస్తుతం గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాల కింద మొత్తం 19 సీట్లు భర్తీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో ఇప్పటికే అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరుగురు టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికవడం ఖాయమైంది. ఇక స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలకు మాత్రమే అవకాశం ఉండటం, ఆ పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతల సంఖ్య భారీగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
మళ్లీ 2023 మార్చి వరకు మండలిలో ఖాళీ ఏర్పడే అవకాశం లేకపోవడంతో ఇప్పుడే పదవి దక్కించుకోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలో పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న 12 మంది మరోసారి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉండగా, వీరితో పాటు మరికొందరు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ కసరత్తు కొనసాగిస్తున్నారు.
12 స్థానాల్లో కనీసం నాలుగు నుంచి ఆరు చోట్ల కొత్తవారికి అవకాశం దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), శంబీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి)కి మరోమారు అవకాశం దక్కనుందని చెబుతున్నారు. మెదక్‌లో ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి నడుమ ప్రధానంగా పోటీ నెలకొంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment