నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహంలో ఈనెల 5న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం వారు సెమినార్ ఏర్పాట్లపై మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, డ్యాం ఎస్‌ఈ విజయ భాస్కర్‌రావులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ లోని పది జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో 500 మంది ప్రజా ప్రతినిధులతో ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సెమినార్‌కు వక్తలుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎస్. జైపాల్‌రెడ్డి, మీడియా ప్రతినిధులు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, నాగేశ్వర్‌రావు రానున్నట్లు తెలిపారు.