
ఓరుగల్లులో టెక్స్‌టైల్ పార్క్
* కాకతీయుల కీర్తిని దేశానికి చాటేలా ఉత్సవాలు
* వరంగల్ జిల్లా సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలోనే అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును నెలకొల్పుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాకతీయ ఉత్సవాలను వరంగల్ జిల్లాకే పరిమితం చేయకుండా.. కాకతీయుల ఘనకీర్తిని దేశ ప్రజలకు చాటేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్టులో రాకపోకలకు అనుగుణంగా ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజధాని తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్‌లో పర్యటించారు. నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
రింగ్‌రోడ్డు, రహదారుల నిర్మాణం, టెక్స్‌టైల్ పార్కుకు అనువైన స్థలం కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకుముందు ప్రతిపాదిత టెక్స్‌టైల్ పార్క్, కాకతీయ ఉత్సవాల నిర్వహణ, వరంగల్ నగర అభివృద్ధి అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు ఎ.చందూలాల్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జి.కిషన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలివీ..
* వేల చెరువులు నిర్మించి అందరికీ అన్నం పెడుతున్న కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేంత ఘనంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్సవాలు జరపాలి. ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రవాసీ దివస్, వైబ్రంట్ తెలంగాణ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ఉత్సవాలు వరంగల్‌కే పరిమితం కావొద్దు. తెలంగాణ పది జిల్లాల్లో ఉత్సవాలు జరపాలి. గోల్కొండ కోట కట్టింది కాకతీయులే. అక్కడా కాకతీయుల ఉత్సవాలు జరపాలి. లక్నవరం, రామప్ప, ఘనపురం, పాకాల వంటి చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. కాకతీయ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి.
* కాకతీయ ఉత్సవాలకు బస్తర్‌లో ఉన్న కాకతీయుల వారసులు కమల్‌చంద్ర బంజ్‌దేవ్‌ను అధికారికంగా ఆహ్వానించాలి. పేరిణి నృత్యానికి పూర్వ వైభవం తేవాలి. మైసూర్‌లో దసరా ఉత్సవాలు నిర్వహించినట్లే కాకతీయ ఉత్సవాలు జరపాలి. ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరోజు వరంగల్‌లోనే ఉండాలి.
* పార్లమెంట్‌లో ఝాన్సీరాణి ఫొటో ఉన్నట్లే రాణి రుద్రమదేవి ఫొటో ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. పోతన, పాల్కురికి సోమనాథ ఉత్సవాలు నిర్వహిస్తాం. బమ్మెరలోని పోతన దున్నిన నాలుగు ఎకరాల స్థలంలో స్మారక కట్టడం ఏర్పాటు చేస్తాం.
* కాకతీయులు అందించిన చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్సారెస్పీ, దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే సాధ్యాసాధ్యాలపై నీటి పారుదల శాఖాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు వద్ద మిషన్ కాకతీయ పైలాన్ ఏర్పాటు చేస్తాం.
* వరంగల్‌లో అత్యున్నత నాణ్యత ప్రమాణాల తో టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తాం. సూరత్‌లో దొరికే చీరలు, షర్ట్, సల్వార్ మెటీరియల్, తిర్పూర్‌లో దొరికే రెడీమేడ్ వస్తువులు, షోలాపూర్‌లో లభ్యమయ్యే చద్దర్లు అన్ని ఒకేచోట లభ్యమయ్యేలా వరంగల్ టెక్స్‌టైల్ పార్కును నెలకొల్పాలి. టెక్స్‌టైల్ పార్కులో తయారైన వస్తువుల మార్కెటిం గ్‌కు సదుపాయాలు కల్పించాలి. పరిశ్రమకు అనుబంధంగా టౌన్‌షిప్ డెవలప్ చేయాలి.
* హైదరాబాద్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటీ కంపెనీలను వరంగల్‌కు తరలిస్తాం. వరంగల్ నగర జనాభా కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపవుతుంది. 20 లక్షల జనాభా జీవనం సాగించడానికి అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలి.
నిరసనలు.. అరెస్టుల నడుమ పర్యటన
ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటన నిరసనలు, అరెస్టుల మధ్య కొనసాగింది. పోలీసులు పలువురు నేతలు, సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. మరికొందరిని పోలీస్‌స్టేషన్లకు తరలించి... సీఎం హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కేసీఆర్ రాకకు ముందే హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు ఇతర నాయకులను గృహ నిర్భం ధం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యాసాగర్, టీపీసీసీ మీడియా సెల్ కన్వీనర్ ఈవీ శ్రీనివాసరావు తదితరులను అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హన్మకొండలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఏఐటీయూసీ నాయకుడు వరద రాజేశ్వర్‌రావును అరెస్టు చేశారు.
కాగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయూలని ఏబీవీపీ విద్యార్థులు సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. హన్మకొండ హంట ర్‌రోడ్డులోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకున్న సీఎంను కలుసుకునేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో టీఆర్‌ఎస్ మహిళా నేతలు పలువురు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఐకేపీ వీఓఏలను పోలీసులు అడ్డుకున్నారు.