సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో ఆరోగ్య శాఖను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య, విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డితో కలసి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం రూ.550 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మ హబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, వ్యాధులను పరిగణనలోకి తీసుకొని పీహెచ్‌సీలను రేషనైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీల సంఖ్య తగ్గించకుండానే అవసరమున్న చోటికి తరలించే లా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కుటుంబం యూ నిట్‌గా ఆరోగ్య సమస్యలపై నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆసుపత్రులన్నింటిలో స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో హెల్త్‌హబ్‌గా కరీంనగర్
1000 పడకల ఆసుపత్రిగా కరీంనగర్ హాస్పిటల్ ను తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించి రాష్ట్రంలోనే హెల్త్ హబ్‌గా మార్చుతామన్నారు. ప్రస్తుతం 33 మెడికల్ కళాశాలలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని, మరో ఏడు మెడికల్ కళాశాలల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment