‘సహకారం’ వాయిదా?   | Telangana Sahakara Elections Is Pending | Sakshi
Sakshi News home page

‘సహకారం’ వాయిదా?  

Published Wed, Jan 9 2019 9:26 AM | Last Updated on Wed, Jan 9 2019 9:26 AM

Telangana Sahakara Elections Is Pending - Sakshi

మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: పంచాయతీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డట్లు సమాచారం. నిన్నటి వరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఏర్పాట్లులో బిజీగా ఉన్న సహకార శాఖ అధికారులు పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం నిర్వహించేలా మంగళవారం సూచనలు రావడంతో అంతా నిశబ్దం అయ్యారు. ఈనెలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం చేయాలని గతనెల 12న ఆదేశాలు అందాయి. రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్టర్‌ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకారశాఖ అధికారులకు  ఓటరు జాబితా, ఎన్నికల అధికారులకు శిక్షణ, రిటర్నింగ్‌ అధికారుల నియామకం తదితర ఏర్పాట్లు చేశారు.

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం సహకార ఎన్నికలు నిర్వహించేలా సూత్రప్రాయంగా ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి ఎన్నికల నిర్వహణ పనులు నిలిపివేశారు. ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయంలో ఓటరు జాబితాను అంటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా సిద్ధం చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడమే  తరువాయి అనుకున్న సమయంలో తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఎన్నికల ఏర్పాట్లకోసం నిధులను ఖర్చు చేయరాదని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ఎన్నికల ఖర్చు చేపట్టరాదని తెలపడంతో  అధికారులు అయోమయంలో పడ్డారు.

సహకార ఎన్నికలు కొన్ని అభ్యంతరాలతో పాటు, పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్, జూలైలో నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా గత జనవరిలోనే పాలక వర్గాల గడువును తొలి విడుతలో ఆరు నెలలకు పెంచింది. ఇప్పటికే రెండుమార్లు పెంచి మరోమారు పెంచేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

మూడుసార్లు వాయిదా.. 
ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పవవీకాలం రెండు సార్లు పొడిగించింది. ముచ్చటగా మూడోసారి కూడా గడువు పొడగించక తప్పేలా లేదు. ఈ మేరకు సంకేతాలందినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్‌ ఇన్‌చార్జీలను మరో ఆరునెలలుపాటు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల గత ఫిబ్రవరి 3వ తేదీతో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది.

ఫిబ్రవరి 4 నుంచి 6 నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని పెంచారు. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించారు. వీరు సహకార కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్నీ పొడిగించారు. ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఆరు నెలల కాలం పదవీకాలన్నీ పొడిగించారు. సహకార సంఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించింది. 2017 ఫిబ్రవరితో గడువు ముగిసింది. పాలవర్గం పదవీకాలం రెండు మార్లు పెంచారు. ఈ గడువు వచ్చే ఫిబ్రవరి 3న గడువు ముగియనుండడంతో ఫిబ్రవరి 5 నుంచి 15లోగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. కాని తాజా ఆదేశాలలో మళ్లీ ఇనాచార్జీల పాలన కొనసాగనుంది.  

తదుపరి ఆదేశాలు వచ్చాకే ఎన్నికలు 
ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు 12 జీవోలు విడుదల చేసింది. కాని ఎన్నికల నిర్వహణ నిధులు ఖర్చు చేయకూడదని సూత్రప్రాయంగా ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఎన్నికల జరిపేందుకు సహకార కమిషనర్, రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఓటరు జాబితా సిద్ధం చేశాం. ఎన్నికల అధికారుల నియామకం, శిక్షణ, బ్యాలెట్‌ పేపర్ల నిర్వహణ ఒక్కటే మిగిలి ఉంది. ఇప్పటే వరకు ఎన్నికను నిలిపివేయాలని అధికారికగా ఆదేశాలు అందలేదు.   – బి.సంజీవ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లాల సహకార శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement