హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ (ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్‌పొజిషన్ ) –2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాప్మా (తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్)తో కలసి రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు.
గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడులు రాబట్టేందుకు 14 ప్రాధాన్యతా రంగాలను రాష్ట్రం గుర్తించిందని.. అందులో పాలిమర్స్, ప్లాస్టిక్స్ కీలకంగా ఉన్నాయన్నారు. 1957లోనే భారత్‌లో ప్లాస్టిక్ పరిశ్రమకు పునాదులు పడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఆరు వేల ప్లాస్టిక్స్ పరిశ్రమల ద్వారా ఏటా ఆరు వేల కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ లు ప్రతి సంవత్సరం 9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌ను చాలా రాష్ట్రాల్లో నిషేధించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వాటిపై మార్గదర్శకాలు రూపొందిస్తోందని తెలిపారు. పర్యావరణానికి హాని చేయని పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. రీయూజబుల్ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు దోహదం చేసే రీసైక్లింగ్ పరిశ్రమలకు అదనపు రాయితీలు కల్పిస్తామని అన్నారు.
350 స్టాళ్లు.. 50 వేల మంది వీక్షకులు..
ఐప్లెక్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అనిల్‌రెడ్డి వెన్నం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ ఎగ్జిబిషన్‌లో 350 స్టాల్స్ ఏర్పాటు చేశారని, 50 వేల మంది సందర్శకులు వీక్షించనున్నారని చెప్పారు. వంద మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యాపా రం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐపీఈటీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఎస్.కె.నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీఐపీఈటీ ద్వారా ప్లాస్టిక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు.
3, 4 శాతం ఉత్పత్తులే ప్లాస్టిక్‌కు చెడ్డపేరు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్స్ భవన్ కోసం రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు టాప్మా అధ్యక్షుడు వేణుగోపాల్ జాస్తి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్రో కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ వర్మ, ఆలిండియా ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హిటెన్ బెడా, వివిధ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment