తెలంగాణ గజగజ
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
ఈనెల 15 వరకూ చలి తీవ్రతే: వాతావరణశాఖ
ఏపీనీ వణికిస్తున్న చలి
లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ చలిగుప్పిట్లో వణుకుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి తీవ్రమైన చలిగాలులు వస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సంక్రాంతి వరకు 9 నుంచి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోవచ్చని చెప్పారు. గత నెలలో ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 10 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భద్రాచలం, నల్లగొండల్లో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చలితో వణికిపోతున్నారు. చలికి స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నవారు అనుమానంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం కూడా తగ్గుతుందని అటు వాతావరణశాఖ, ఇటు వైద్యశాఖ చెబుతున్నాయి.
లంబసింగిలో సున్నా డిగ్రీలు
పాడేరు/ చింతపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత అధికంగా ఉంది. చింతపల్లి మండలంలోని పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో ఆదివారం సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతకు మన్యం ప్రజలు విలవిలలాడుతున్నారు. చింతపల్లిలో మూడు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద ఐదు డిగ్రీలు, అలాగే పాడేరు ఘాట్‌లోని పోతురాజు గుడి ప్రాంతంలో రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. నందిగామ, రెంటచింతలలో 10, అనంతపురంలో 11.9, కర్నూలులో 12.9, ఆరోగ్యవరం, బాపట్లలో 13, కళింగపట్నంలో 13.6, విజయవాడలో 15, తిరుపతిలో 15.5, కాకినాడలో 16.2, నెల్లూరులో 19.4, విశాఖపట్నంలో 19.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.