పారదర్శకతకు పెద్దపీట
సిద్దిపేట జోన్/ సిద్దిపేట రూరల్: పారదర్శకతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆ మేర కే పాలన ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగధాంపల్లి, ఎన్జీఓస్ కాలనీలో జరిగిన ‘మనవార్డు- మన ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. సామూహిక సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. విలీన గ్రామం రంగధాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అందులో భాగంగా అర్హుల ఎంపిక కూడా ప్రజల మధ్యే చేస్తామన్నారు. రంగధాంపల్లి గ్రామం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష, అమరవీరుల స్థూపం గ్రామ శివారులోనే నిర్మించామన్నారు. గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్‌లో కూర్చొని క్షేత్రస్థాయి పనులకు నిధులను విడుదల చేసేవన్నారు. దీంతో ప్రజల అవసరాలను గుర్తించడంలో ప్రభుత్వాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలోనే ప్రజా సమస్యలను చర్చించేందుకు ‘మన వార్డు - మన ప్రణాళిక’ పేరిట ప్రజల్లోకి వచ్చిందన్నారు.
దీంతో ప్రజల అవసరాలను ప్రజల సమక్షంలోనే గుర్తించే వీలు కలుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీతో తెలంగాణలోని 30 లక్షల మంది రైతులకు మేలు జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇష్టమైన బతుకమ్మ పండుగ రోజు నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు. ఇక ట్రాక్టర్లు, ఆటోలకు సంబంధించిన పన్ను విధానాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. దళితుల కుటుంబాల్లోని యువతుల వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
అదే విధంగా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యోగం అందించనుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. అంతకుముందు రంగధాంపల్లి గ్రామంలో సబ్‌స్టేషన్, గ్రామ శివారులో డివైడర్లతో కూడిన లైటింగ్‌లను ఏర్పాటు చేస్తానని, గ్రామాన్ని సిద్దిపేట విద్యుత్ పరిధిలోకి మార్చనున్నట్లు మంత్రి హామీనిచ్చారు. అదే విధంగా గ్రామానికి మంజూరైన మహిళ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎన్‌జీఓస్ కాలనీలో నిర్వహించిన వార్డు సభలో మంత్రి హరీష్‌రావు పాల్గొని పలువురి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ చౌరస్తా నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు డివైడర్లు, లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని హామీనిచ్చారు. సభల్లో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, వివిధ శాఖల అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్, సుధాకర్‌గౌడ్, ఆనంద్, లక్ష్మణ్, ఇంతియాస్, ప్రభాకర్, కృష్ణారెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.