సరిహద్దులో నిఘా | Telangana state check post high alert | Sakshi
Sakshi News home page

సరిహద్దులో నిఘా

Published Wed, May 21 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

Telangana state check post high alert

అలంపూర్/అచ్చంపేట, న్యూస్‌లైన్ :  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో సరిహద్దులో నిఘా మ రింత పెరగనుంది. ఈ నేపథ్యంలోనే కొత్త చెక్‌పోస్టులు రాబోతున్నాయి. తెలంగాణ-రాయలసీమకు సరిహద్దుగా ఉన్న అలంపూర్ నియోజకవర్గంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేయనున్నారు. మానవపాడు మండలం పుల్లూరు గ్రామం సమీపంలో ఈ చెక్‌పో స్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
 
 ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఒకటిగా ఉన్న ఈ రాష్ట్రంలో రాయలసీమ-తెలంగాణ సరిహద్దులో ఎలాంటి చెక్‌పోస్టులు లేవు. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకరాష్ట్రాలుగా ఏర్పడబోతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సీమాంధ్ర సరిహద్దుల్లో 8 చెక్‌పోస్టులు పెట్టాలనే నిర్ణయం జరిగినట్లు సమాచారం. జిల్లాలో రెండుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పడబోతుండగా, అందులో అలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామ శివారులోని జాతీయరహదారి టోల్‌ప్లాజాకు సమీపంలో కొత్త చెక్‌పోస్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు వాణిజ్య శాఖ చెక్‌పోస్టుగా పేరుగాంచిన పుల్లూరు చెక్‌పోస్టు కొత్త రాష్ట్రానికి సరిహద్దు చెక్‌పోస్టుగా మారనుంది. చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు జాతీయరహదారిపై రయ్.. రయ్...అని దూసుకెళ్లే వాహనాలకు బ్రేక్ పడనుంది. సరిహద్దు గ్రామాలకూ భద్రత ఉండనుంది.
  ఈగలపెంట వద్ద మరో చెక్‌పోస్టు
 శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మహబుబ్‌నగర్-కర్నూల్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈగలపెంట కృష్ణవేణి అతిథిగృహం సమీపంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల్లో ఇదొకటి. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో రెండు జిల్లాల మధ్య వారదిగా ఉన్న బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేయాల్సి ఉన్నా డ్యాం పరిసర ప్రాంతంలో వాహనాలను నిలపడం కష్టం కావడంతో ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 ప్రస్తుతం అచ్చంపేట, మన్ననూర్,  దోమలపెంటల వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. రాత్రి 9గంటల తర్వాత అమ్రాబాద్, మద్దిమడుగు పేరుతో వాహన దారులు శ్రీశైలం వెళ్తున్నట్లు గమినించిన అటవీశాఖ అధికారులు ఈ మధ్యే చెరువుకొమ్ము లింగమయ్య వద్ద మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య ఏర్పాటయ్యే చెక్‌పోస్టు నిర్వహణ బాధ్యతలు  కూడా వారికే అప్పగిస్తున్నట్లు తెలిసింది. అక్కడే టోల్‌గేట్‌ను కూడా ఏర్పాటు చేసే అలోచన ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement