మహిళలు..మహారాణులు
అలంపూర్, న్యూస్‌లైన్: రిజర్వేషన్‌లతో అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూరుతోంది. ఈ సారి మహిళలకు రాజకీయాల్లో సగం రిజర్వేషన్‌లు కల్పిం చిన విషయం తెలిసిందే. దీంతో అలంపూర్ ని యోజకవర్గంలో మహిళా మణుల ప్రాముఖ్యత పెరిగింది. కేటాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో అతివలకే అధిక ప్రాధాన్యం ద క్కింది.
అలంపూర్, ఇటిక్యాల, వడ్డేపల్లి, మానవపాడు, అయిజ మండలాల్లో 79 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. వీరిలో జనరల్ మహిళలకు13, బీసీ మహిళకు16, ఎస్సీ మహిళకు11 స్థానాలకు మొత్తంగా మహిళలకు 40 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. అలంపూర్ మండలంలో 13 ఎంపీటీసీలకు ఏడు, అయిజ మండలంలో16కు 8, ఇటిక్యాల మండలంలోని 15 స్థానాలకు ఏడు, మానవపాడు మండలంలోని 15 స్థానాలకు 8, వడ్డేపల్లి మండలంలోని 20 స్థానాలకు 10 స్థానాల్లో మహిళలు పోటీచేసి ఆ స్థానాల్లో ఎంపికకానున్నారు.
ఇక జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లోనూ మహిళలకే అధికస్థానాలు దక్కాయి. ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ముగ్గురు మహిళలు, ఎంపీపీ స్థానాల్లో ముగ్గురు మహిళ ప్రతినిధులు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆయా స్థానాల్లో 83 మంది పోటీకి సిద్ధపడుతుండగా వారిలో 40 మంది పురుషులు, 43 మంది మహిళలే ఉన్నారు. ఈ లెక్కన ఈసారి ఎన్నికల తర్వాత ఆయా స్థానాలనుంచి 46 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజాపాలనలో కొలువుదీరనున్నారు.
ఇదిలా ఉండగా దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదోశక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ అమ్మవారి ఐదోశక్తి పీఠక్షేత్రంలో ఇటీవల కొలువుదీరిన నూతన ఆలయ పాలక మండలికి తొలిసారిగా మహిళా చైర్మన్‌గా లక్ష్మిదేవమ్మకు అవకాశం దక్కింది. అంతేకాకుండా ధర్మకర్తల సభ్యులుగా 10 మందిని ఎంపికచేస్తే..వారిలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. జోగుళాంబ క్షేత్రంగా కీర్తిగడించిన అలంపూర్ ప్రాంతంలో మహిళల ప్రాధాన్యం పెరగడంతో మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తోంది.