* ఇరాక్‌లో రోడ్డు పాలైన రాష్ట్ర వాసులు
* పాస్‌పోర్టులు లాక్కుని పని కల్పించని అక్కడి దళారులు
* ప్రభుత్వం సాయం చేయాలని వేడుకోలు
రాయికల్, న్యూస్‌లైన్: బతుకుదెరువు నిమిత్తం ఇరాక్ వెళ్లిన సుమారు వంద మంది బడుగు జీవులు అక్కడి ఏజెంట్ల చేతిలో మోసపోయి నరకయాతన పడుతున్నారు. వీరిలో అత్యధికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారే. వారి వ్యథలను గురువారం ‘న్యూస్‌లైన్’కు ఈమెయిల్ ద్వారా వివరించారు. ఇరాక్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఇక్కడి ఏజెంట్లు చెప్పడంతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి మరీ వారి చేతిలో పెట్టారు.
వీరిలో కరీంనగర్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సంతోష్, జ్ఞానేశ్వర్, చిన్నఎల్లయ్య, జగిత్యాలకు చెందిన విక్రమ్, నవీన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కృష్ణ, ముత్యం, శ్రీనివాస్, నవీన్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్, ఖమ్మంకు చెందిన రాములుతోపాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురు ఉన్నారు. ఏజెంట్లు ఇచ్చిన వీసాలతో వీరంతా 45 రోజుల క్రితం ఇరాక్‌లోని బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే అక్కడి దళారులు ఒక్కొక్కరివద్ద 200 డాలర్లతోపాటు పాస్‌పోర్టులు లాక్కున్నారు. పని చూపించమని అడిగితే దాడి చేసి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. అప్పటినుంచి వీరి బతుకులు రోడ్డు పాలయ్యాయి. తిండిలేక, వసతి లేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తెలిసిన వారి గదుల్లో తలదాచుకుంటున్నారు. పాస్‌పోర్టులు లేకపోవడంతో ఎక్కడా పనికి వెళ్లలేకపోతున్నారు. ఇరాక్ పంపించిన ఏజెంట్లను ఫోన్‌లో సంప్రదిస్తే తమకు సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత రాయబార కార్యాలయం అధికారులు స్పందించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని తమ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
పనిలేదు... తిండిలేదు
Published Sat, Jun 7 2014 3:16 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement