సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరై తిరిగి వచ్చిన మంత్రి ఈటల, శనివారం సీఎం కేసీఆర్‌ను కలసిన సందర్భంగా ప్రశంసలు అందుకున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై పన్ను వద్దని, ప్రభుత్వమే ప్రభుత్వం మీద పన్ను వేయడం ఏమిటని జీఎస్టీ సమావేశంలో ఈటల ప్రశ్నించారు. మిషన్ భగీరథ, నీటిపారుదల పథకాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులపై 18 శాతం పన్ను విధించడంపై ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్ను తగ్గించే వరకు పట్టుబట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై ఈటల ఒత్తిడి తీసుకొచ్చారని మంత్రి కార్యాలయం తెలిపింది.
మంత్రి ఈటల ఒత్తిడికి దిగివచ్చిన జీఎస్టీ కౌన్సిల్.. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులపై పన్నును 5 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం పట్ల ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ సాధించిన విజయమిది అన్నారు. ఇప్పటి వరకు 22 జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరగగా, 20 సమావేశాల్లో ఈటల పాల్గొని వాదనలు వినిపించారు. వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులపై పన్నులు వేయవద్దని, పేద ప్రజలు వినియోగించే వస్తువులపై తక్కువ పన్నులు ఉండాలని ఈటల లేవనెత్తిన వాదనలకు మిగతా రాష్ట్రాలు కూడా మద్దతు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment